నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి తండా నుంచి తెల్లాపూర్ వైపు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్టు విస్తరణలో భాగంగా పలు నిర్మాణాల కూల్చివేతలో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. గోపన్‌పల్లి తండా మీదుగా తెల్లాపూర్ వైపు ప్రస్థుతం ఉన్న 30 – 40 ఫీట్ల రహదారిని 100 ఫీట్లకు విస్తరించనున్న దృష్ట్యా గతంలో ఈ రహదారి విస్తరణలో భాగంగా గోపన్‌పల్లి సర్వెనెంబర్ 34లోని 43 నివాసాలను, అదేవిధంగా ప్రైవేట్ సర్వే నెంబర్‌లోని మరో 15 నివాసాలను కూల్చివేయాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు గుర్తించారన్నారు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన 43 నివాసాలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే క్రమంలో ప్రభుత్వం యజమానుల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఇతరాత్ర వివరాలు ఇవ్వాలని 2018లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. బడా బాబుల వెంచర్లకు మార్గం సుగమం చేసేందుకు పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గోపన్ పల్లి తండా గ్రామ ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.