- అక్రమంగా తమ నిర్మాణాలు కూల్చేశారంటు జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళన…
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలోని గోపన్ పల్లిలో రంగనాథ్ నగర్ ఇళ్ల స్థలాల యజమానులు రోడ్డెక్కారు. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఇంధ్రకరణ్ రెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గత నెల 30న కొందరు వ్యక్తులు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సహాయంతో తమపై దాడి చేసి ఇళ్లను కూల్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. కాగా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డిలు బాధితులకు మద్ధతుగా నిలిచారు. వారి పక్షాన జోనల్ కమిషనర్ ప్రియాంకను కలసి సమస్యను వివరించారు. స్పందించి జడ్సీ తాను ఇటీవలే భాద్యతలు చేపట్టానని, ఘటన గురించి విచారణ జరిపి వారం రోజుల్లో ఆ అంశంపై చర్చిస్తానని హామి ఇచ్చారు. దీంతో బాధితులు వెను దిరిగారు.
కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే కాటేస్తున్నారు: బాధితులు
రంగనాథ్ నగర్ ప్లాట్ల యజమానులు, బాధితులు ప్రకాష్ రెడ్డి, మంగ శ్రీనివాస్, రాఘవేందర్ రావు, మహేష్, శ్రీనివాస్, మహ్మద్ హుస్సేన్, పద్మావతి, అశోక్‌కుమార్, రమణ, మధుయాదవ్ తదితరులు మిడియాతో మాట్లాడుతూ గోపన్‌పల్లి సర్వే నెంబర్ 163, 165, 167, 169, 276, 277, 278, 279, 281లలో 1987లో ఎన్‌వీ రమణ చౌదరి అనే వక్తి 104 ఎకరాలలో 1428 ప్లాట్లతో లేఅవుట్ వేయగా తాము కొనుగోళు చేసి అందులోనే చిన్న గదులుగా నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఐతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీప బంధువు రంజిత్‌రెడ్డి, రామనాయుడు స్టూడియో సురేష్, జలవిహార్ రామరాజు తదితర బడాబాబులు తమ స్థలాలపై కన్నేశారని, ఈ క్రమంలోనే అక్రమంగా తమ నిర్మాణాలను కూల్చివేయించారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు 20 నిర్మాణాలను కూలిస్తే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రాత్రి వేళ అక్రమంగా వందల నిర్మాణాలను కూల్చివేశారని అన్నారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే కంప్లైట్ తీసుకునేందుకు ఒక రోజంతా వేచి ఉంచారని అన్నారు. అతి కష్టం మీద రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారని అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలే అక్రమంగా తమ నిర్మాణాలను కూల్చివేయిస్తుంటే తమ గోడును ఎవరికి వెళిబుచ్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూపాయి రూపాయి కూడబెట్టుకోని కొనుకున్న తమ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేదే లేదని, ఎంతటి పోరాటానికికైనా సిద్ధమని హెచ్చరించారు.
21 నిర్మాణాలను కూల్చేశాం: జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి
రంగనాథ్ నగర్‌లో నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ జాయింట్ కమిషనర్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ మల్లారెడ్డిని నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు రంగనాథ్ నగర్ లేఅవుట్‌లోని పలు నిర్మాణాలు అక్రమమైనవని, నోటీసులు అందించారని, ఈ క్రమంలోనే 21 నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని తెలిపారు.
రంగనాథ్ నగర్ లో ప్రైవేటు వ్యక్తులు రాత్రివేళ అక్రమంగా నిర్మాణాలను కూల్చి వేస్తున్న దృశ్యం