శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుతగులుతున్న బిసి వ్యతిరేకులకు తగిన స్థాయిలో బిసి సమాజం బుద్ధి చెబుతుందని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర అన్నారు. బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా కనీసం గ్రామ సర్పంచులు కూడా కాకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు బిసి లకు అన్యాయమే చేస్తున్నాయని ఆరోపించారు. బిసి ల రిజర్వేషన్ లను అడ్డుకునే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ బిసి కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశాచారి అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణిమంజరి సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర తదితరులు పాల్గొన్నారు.






