నమస్తే శేరిలింగంపల్లి: బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం… నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందిన సాయి నిఖిత్ రెడ్డి(21) ఘట్‌కేసర్‌లోని సీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కొల్లాపూర్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చిన సాయి నిఖిత్ రెడ్డి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న కొల్లాపూర్ పోలీసులు సాయినిఖిత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఆధారంగా లోకేషన్ ట్రేస్ చేశారు. మియాపూర్ ప్రాంతంలో లోకేషన్ గుర్తించిన పోలీసులు, వారి బంధువులతో కలసి మంగళవారం రాత్రి మియాపూర్‌కు చేరుకున్నారు. మెట్రో స్టేషన్‌తో పాటు స్థానిక మాతృశ్రీనగర్‌లోని పలు సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో పరిసర ప్రాంతాలంతా గాలించారు. చివరకు బుదవారం తెల్లవారు జామున మాతృశ్రీనగర్‌లోని ప్రమోద్ రెసిడెన్సీ వద్ద సాయినిఖిత్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లోని 6వ అంతస్థు నుంచి సాయినిఖిత్ ఫోన్, పర్స్, కళ్లద్ధాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన టిక్కెట్‌లను బట్టి సాయినిఖిత్ కొల్లాపూర్ నుంచి నగరానికి బస్సులో వచ్చి, మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. భవనం పైనుంచి దూకాడా లేక మరోరకంగా మృతి చెందాడా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నమియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవఖానాకు తరలించారు.
అడుగడుగున అనుమానాలు…
సాయినిఖిత్ రెడ్డి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం ఉదయం కొల్లాపూర్‌లోని ఇంటి నుంచి బయలు దేరిన సాయి నిఖిత్ రెడ్డి బస్సు ఎక్కి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడు..? మియాపూర్‌లో బంధువులు, మిత్రులు లేని సాయినిఖిత్ నేరుగా మాతృశ్రీనగర్ ప్రమోద్ రెసిడెన్సి వద్దకు ఎందుకు వచ్చాడు..? అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఉంటే ఒంటిపై బలమైన గాయాలెందుకు లేవు..? ఇలా అనేక అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప అసలు విషయం తేలిసేలా లేదు. కాగా వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీస్తుండగా, క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఐతే సాయి నిఖిత్ రెడ్డి అమాయకుడని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని, ఎవరో కావాలనే నగరానికి రప్పించి అతడి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చి భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.