శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నాలా ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. నల్లగండ్ల చెరువు నుంచి చందానగర్ వరకు విస్తరించి ఉన్న లింగంపల్లి నాలా వెంట అక్రమ నిర్మాణాలను శుక్రవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. నాలా విస్తరణకు 16 మీటర్లుగా నిర్ణయించిన అధికారులు, ఆ పరిసరాలలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. ఈ చర్యలు నాలా ప్రవాహాన్ని సులభతరం చేసి, భవిష్యత్తులో ఎదురయ్యే వరద ముప్పును తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఉన్నపళంగా వచ్చి ఇళ్లను కూల్చడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాల విస్తరణ పేరుతో హైడ్రా పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదని బాధితులు మండిపడ్డారు.