శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి కార్యక్రమాన్ని మియాపూర్ డివిజన్ యంఎ నగర్ తాండ్ర రామచంద్రయ్య స్మారక భవన్ లో వల్లెపు అనిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో గాదగోని రవి మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య అతి చిన్న వయసులోనే నాటి దొరలు, భూస్వామ్య, జాగీర్దార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, వారు చేస్తున్న వెట్టిచాకిరి కి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయిన సందర్బంగా కడవెండి గ్రామంలో సాగిన ప్రజా ప్రదర్శనపై భూస్వామ్య గుండాలు జరిపిన కాల్పుల్లో కొమురయ్య తొలి అమరుడు కావడం జరిగిందన్నారు. ఆ ఉద్యమం ఉధృతం అయి తెలంగాణ వ్యాప్తంగా సాయుధ పోరాట రూపం తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ పోరాట స్ఫూర్తితో 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ, 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, 4500 మంది రక్త తర్పణం కావించిన ఈ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే ప్రపంచానికి స్పూర్తిగా నిలించిందన్నారు. ఈ పోరాట స్ఫూర్తిని నేటికీ కూడా ఆదర్శంగా తీసుకుని ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడం ప్రజలలోకి వెళ్ళి ప్రజల తలలో నాలుకగా మారి పని చేయాలని పిలుపు నిచ్చారు. గత ఐదు రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణించిన వారి మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పటంలో పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతున్నదని అన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు ఐదు కోట్ల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని అన్నారు. యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేయాలని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యం సి పి ఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు కుంభం సుకన్య, వి తుకారాం నాయక్, మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, కార్యదర్శి వర్గ సభ్యులు జి శివాని, డి నర్సింహా, జి లలిత, బి అరుణ, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.