శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న పేదల గుడిసెలను కూల్చివేయడం, ఇక్కడ ఉన్న అధికార పార్టీ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాత్రికి రాత్రే దాదాపు 300 ఇళ్లను కూల్చివేయడం అమానవీయ చర్య అని పలువురు నాయకులు అన్నారు. వారికి ఉండటానికి అన్ని విధాల అర్హతలు ఉన్నా ప్రభుత్వం వాళ్లను గుర్తించి పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వకుండా, ఈ ప్రభుత్వ భూమినీ బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుందని అర్థమవుతుందన్నారు. గతంలో ఈ స్థలం కూల్చివేతలు జరిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చి పేద ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు ఆయన మరొకరికి ఈ భూమిని కట్టబెట్టినట్టు సమాచారం వస్తుందన్నారు.ఈ మేరకు బసవతారక నగర్ గుడిసెలు కూల్చిన సమాచారం అందుకున్న యంసిపిఐ(యు) పార్టీ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించి పార్టీ, ప్రజా సంఘాలు అండగా ఉంటాయని భవిష్యత్తులో వారితో కలిసి వారికి స్థిర నివాసాలు ఏర్పడే వరకు పోరాటాలు నిర్వహిస్తామని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అఖిలభారత ప్రజా తంత్ర విద్యార్థి సమాఖ్య (ఎ ఐ యప్ డి యస్) రాష్ట్ర అద్యక్షుడు పల్లె మురళి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర కళావతి, అఖిలభారత ప్రజా తంత్ర మహిళా సమాఖ్య (ఎ ఐ యప్ డి డబ్ల్యు), రాష్ట్ర కమిటీ సభ్యురాలు విమల, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు వల్లెపు అనిత, అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (ఎ ఐ యప్ డి వై)రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుల్తాన బేగం పాల్గొన్నారు.