నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో విలువైన చెరువు స్థలాల పరిరక్షణకు అధికార యంత్రాంగం పటిష్టంగా వ్యవహరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. చెరువుల పర్యవేక్షణకు నియమించిన అధికారులు విధిగా తమ పరిధిలోని చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని సూచించారు.
గురువారం శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో చెరువుల పరిరక్షణపై జిహెచ్ఎంసి… ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాన్ని జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ తో కలిసి కలెక్టర్ శశాంక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ల పైన అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. చెరువుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో ఎటువంటి ఆక్రమణలను సహించవద్దని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఆక్రమించే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, చెరువులని పూర్తిస్థాయిలో పరిరక్షించి ముందు తరాలకు అందించాలని కలెక్టర్ తెలిపారు.
చెరువుల పరిరక్షణ కమిటీలతో ఎప్పటికప్పుడు జోనల్ అధికారులు సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి ఇరిగేషన్ శాఖ అధికారులు, చెరువుల పరిరక్షణ కమిటీ అధికారులు పాల్గొన్నారు.