నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని తపస్వి ఫౌండేషన్ అనాథ శరణాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఫ్రూట్స్, బిస్కెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు జ్యోతిరావు గోవిందరావు పూలే అని కొనియాడారు. మానవుడు సర్వతోముఖాభి వృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని.. ఆ దిశగా ముఖ్యంగా మహిళల అక్షరాస్యతకై విశేషమైన కృషి చేశారని తెలిపారు. తన సతీమణి సావిత్రి బాయి పూలేకు విద్య నేర్పించి తదనంతరం ఉపాధ్యాయ శిక్షణనిప్పించి 1848లో మహిళలకు తొలి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారని, అలా సావిత్రిబాయి పూలే మనదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని అయ్యారని పేర్కొన్నారు.
“నేటి యువత ఆ పుణ్య దంపతుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని మహిళా సాధికారతకు బహుజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమే వారికర్పించే నిజమైన నివాళి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు చందు శాంతి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, శివరామకృష్ణ, ధర్మసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.