గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా డిమాండ్
గచ్చిబౌలి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడా ప్రధాన రహదారిపై మూసివేసిన యూటర్న్ ను వెంటనే తెరవాలని స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా డిమాండ్ చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ మూసివేయడంతో తాము ఇబ్బందులకు గురవుతున్న సమస్యను గ్రామస్తులు కార్పొరేటర్ సాయిబాబ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన మంగళవారం యూటర్న్ మూసివేయద్దంటూ ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేయగా, ట్రాఫిక్ పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు. తన వంటి ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించే పోలీసులు సామాన్య ప్రజలతో ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.