శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్‌లో భర్త వేధింపులు భరించలేక భార్య అతడిపై చెక్కకర్రతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మొరంపూడి సూరిబాబు (44), అతని భార్య మొరంపూడి రమణ (39) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామంలోని కొత్తపేటకు చెందినవారు. సుమారు రెండేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. సూరిబాబు వివిధ ప్రాంతాల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, రమణ హౌస్‌కీపింగ్ పనులు చేసేది. గత 20 రోజులుగా వీరిద్దరూ కొండాపూర్‌లోని మసీద్‌బండ గ్రామం, సి.ఎం.సి. లేఅవుట్‌లో ఉన్న ఓ నిర్మాణ స్థలంలో నివాసం ఉంటూ పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో సూరిబాబు తరచూ మద్యం సేవించి భార్య రమణ నడవడికపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవపడేవాడు. అంతేకాకుండా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కొట్టేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భర్త వేధింపులను తొలుత భరిస్తూ వచ్చిన రమణ, నిరంతర వేధింపులతో విసిగిపోయి అతడి నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో హత్యకు నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నవంబర్ 6, 7 తేదీల మధ్య రాత్రి సూరిబాబు మద్యం మత్తులో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. ఈ సమయంలో ఆమెను చేతులతో కొట్టడంతో రమణ అతడిని తోసివేసింది. దీంతో సూరిబాబు నేలపై పడిపోయాడు. ఆగ్రహానికి గురైన రమణ నిర్మాణ పనుల కోసం ఉపయోగించే చెక్కకర్రను తీసుకుని అతడి తలపై, శరీరంలోని ఇతర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన సూరిబాబును తొలుత కొండాపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. నవంబర్ 8న ఉదయం 9.05 గంటలకు ఉస్మానియా ఆసుపత్రిలోని ANSC వార్డులో చేరిన సూరిబాబు చికిత్స పొందుతూ నవంబర్ 11న సాయంత్రం 4.24 గంటలకు మృతి చెందాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర ఆధారాలను సేకరించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





