పిల్లల అభిప్రాయాలకే ప్రాధాన్యం.. UNICEF సహకారంతో CMC కీలక కార్యక్రమం..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పట్టణ ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), UNICEF సహకారంతో లిజనింగ్ టు చిల్డ్రన్ (LTC) కార్యక్రమంపై అవగాహన సదస్సును నిర్వహించింది. మంగళవారం CMC కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి CMC కమిషనర్ సృజ‌న‌, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు (HODs), జోనల్ కమిషనర్లు (ZCs), డిప్యూటీ కమిషనర్లు (DCs), పట్టణ సమాజ అభివృద్ధి విభాగం (UCD) అధికారులు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు (POs), కమ్యూనిటీ ఆర్గనైజర్లు (COs), వార్డు స్థాయి రిసోర్స్ పర్సన్లు (RPs) హాజరయ్యారు. ఈ సందర్భంగా CMC కమిషనర్, UNICEF సాంకేతిక బృందం అధికారులు LTC కార్యక్రమం లక్ష్యాలు, మార్గదర్శకాలు, అమలు విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒప్పందం (UNCRC)లోని ఆర్టికల్ 12 ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తమను ప్రభావితం చేసే అంశాలపై పిల్లలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును ఈ ఒప్పందం కల్పిస్తుంది. వారి వయస్సు, పరిపక్వతకు అనుగుణంగా ఆ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సదస్సులో వివరించారు. మా భాగస్వామ్యం లేకుండా మా గురించి ఏ నిర్ణయమూ వద్దు (Nothing About Us Without Us) అనే నినాదంతో పిల్లలను కేవలం ప్రభుత్వ సేవల లబ్ధిదారులుగా కాకుండా, పట్టణ ప్రణాళిక, అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములుగా గుర్తించాలని అధికారులు సూచించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, పాఠశాలలు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, వినోద సౌకర్యాలపై పిల్లల అభిప్రాయాలను సేకరించడం ద్వారా వారి భద్రతకు సంబంధించిన సమస్యలు, మౌలిక వసతుల లోపాలను గుర్తించవచ్చని తెలిపారు.

CMC పరిధిలోని అన్ని వార్డుల్లో LTC కార్యక్రమాన్ని అమలు చేసేందుకు UNICEF సాంకేతిక బృందం రూపొందించిన ప్రామాణిక టూల్‌కిట్లు, అసెస్‌మెంట్ నమూనాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా భద్రతా మ్యాపింగ్, పార్కులు, పరిసర ప్రాంతాల పరిశీలన, గ్రూప్ చర్చలు, చిత్రాల ద్వారా పిల్లల అభిప్రాయాల సేకరణ వంటి పద్ధతులను వివరించారు. పిల్లల భద్రత, స్వచ్ఛంద భాగస్వామ్యం, వివక్షకు తావులేకుండా చూడటం, నైతిక ప్రమాణాల పాటింపు, పెద్దల ప్రభావం లేకుండా వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా CMC కమిషనర్ మాట్లాడుతూ, LTC కార్యక్రమం కేవలం అవగాహన సదస్సుకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు సాధించేలా అమలు చేయాలని సూచించారు. UCD విభాగానికి చెందిన ప్రాజెక్ట్ ఆఫీసర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు CMC పరిధిలోని అన్ని వార్డుల్లో పిల్లలతో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు, సమస్యలను పద్ధతిగా నమోదు చేయాలని ఆదేశించారు.

అన్ని శాఖల అధిపతులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు UCD బృందాలతో సమన్వయం చేసుకుంటూ వార్డుల వారీగా సేకరించిన అభిప్రాయాలను పరిశీలించి, వాటిని మున్సిపల్ ప్రణాళికలు, అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా పార్కులు, ఖాళీ స్థలాలు, పాఠశాలల పరిసరాలు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, కమ్యూనిటీ సదుపాయాల అభివృద్ధిలో పిల్లల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పిల్లలు చేసిన సూచనల ఆధారంగా చేపట్టిన చర్యలను తిరిగి వారికి తెలియజేసేలా సమర్థవంతమైన ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల పౌర సంస్థలపై పిల్లల్లో నమ్మకం పెరగడంతోపాటు పౌర భాగస్వామ్యం కూడా బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సదస్సులో అందించిన మార్గదర్శకాలు, కాలపరిమితులు, అసెస్‌మెంట్ నమూనాల ప్రకారం అన్ని జోన్లలో LTC కార్యక్రమాన్ని తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జోనల్ కమిషనర్లు, శాఖాధిపతులు, UCD సిబ్బందిని ఆదేశించారు. పిల్లల ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలకు పట్టణ ప్రణాళిక, నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా సురక్షితమైన, సమ్మిళితమైన, పిల్లలకు అనుకూలమైన నగర నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని CMC స్పష్టం చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here