జిహెచ్ఎంసి లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫైర్
మియాపూర్: పబ్లిక్ టాయిలెట్ల పేరిట టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. సోమవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ తో కలిసి మియాపూర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో టిఆర్ఎస్ ప్రభుత్వం వందల సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసిందని పురుషుల మరుగుదొడ్డి కోసం ఐదు లక్షలు, స్త్రీలకు 7.5 లక్షల రూపాయలను వెచ్చించారన్నారు. ఇంత ఖర్చు చేసినా ఒక్క మరుగుదొడ్డి వద్ద కూడా నిర్వహణ సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి డబ్బాలను ఏర్పాటు చేశారని, టాయిలెట్ల వద్ద నీటి సౌకర్యం సైతం లేదని, కొన్నింటికి ఔట్ లెట్లు సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. నిర్వహణ లోపం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తుందని, ప్రజాధనంతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఇటువంటి సౌకర్యాలను ఉపయోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగ్గా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ముందు వాటి సంగతి చూడాలన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగ పరిచేలా ఉండరాదని సూచించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు ఇలియజ్ షరీఫ్ తదితరులు ఉన్నారు.