ప్రభుత్వ బోరు… ప్రైవేట్ దందా…

  • మున్సిపాలిటీ బోరును ప్రైవేటు వాటర్ ప్లాంట్ కు మళ్లింపు…
  • ప్రజలకు దక్కాల్సిన నీటితో యదేచ్చగా వ్యాపారం…

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు దందాకు వాడుకోవాలంటే ఆషామాషీ కాదు. ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహం అధికారుల అండ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్ లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ కథ ఎందో ఒకసారి చూద్దాం రండి.

ప్రభుత్వ బోరు నుండి పబ్లిక్ ట్యాప్ లకు వెళ్లే పైప్ లైన్లను తొలగించి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ పైపుకు మళ్లించిన దృశ్యం

చందానగర్ ప్రాంతం గతంలో జిహెచ్ఎంసి పరిధిలో.. అంతకుముందు శేరిలింగంపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉండేది. అప్పట్లో మంజీరా నీటితోపాటు ఎక్కడికక్కడ బోరు నీటి సరఫరా జరిగేది. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అక్కడక్కడ బోర్లు వేయించి, మోటార్లు ఏర్పాటు చేసి తద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు బోరు నీటిని సరఫరా చేసేవారు. ఈ క్రమంలోనే చందానగర్ రాజీవ్ నగర్ వద్ద అలాంటి బోరు స్థానిక బస్తి వాసుల నీటి అవసరాలను తీర్చేది.

బోర్ నుంచి వాటర్ ప్లాంట్ కు రోడ్డు మధ్యలో నుంచి వేసిన పైప్ లైన్

కాలక్రమంలో ప్రభుత్వం ఇంటింటికి మంచినీటి సరఫరా అందించడంతో ఈ బోరు వ్యవస్థ మరుగున పడుతూ వచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాటర్ సప్లై విభాగం విధులు దాదాపు ఆపేసి ఆ సిబ్బందిని ఇతర శాఖలోకి మార్చారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల బోర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ బోర్లను తమ సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు. రాజీవ్ నగర్ బస్తి వద్ద ఉన్న బోరును కొందరు వ్యక్తులు ప్రైవేట్ వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. నాటి మున్సిపాలిటీ బోరు నుంచి కొంత దూరం వరకు పైప్ లైన్లను వేసుకొని దూరంగా ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అక్కడినుండి 24 గంటల పాటు నీటి దందా కొనసాగిస్తు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.

ప్రభుత్వ బోరు నుంచి వచ్చిన నీటితో వ్యాపారం సాగిస్తున్న వాటర్ ప్లాంట్ ఇదే

ప్రైవేట్ స్థలాల్లో బోరు వేసుకుంటేనే అనుమతులు లేవంటూ ఇబ్బందులు పెట్టే రెవెన్యూ యంత్రాంగం ఒక ప్రభుత్వ బోరును ప్రైవేటు వాటర్ ప్లాంటుకు మళ్ళించుకొని అక్రమంగా నీటి దందా కొనసాగిస్తుంటే ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. అసలే ఎండాకాలం అందులో నీటి ఎద్దడితో చందానగర్ పరిసర ప్రాంతాలవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ప్రభుత్వ బోరుతో యదేచ్చగా దందా చేసుకుంటున్న వారిని ఆటు రెవెన్యూ ఇటు సీఎంసి అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారనేది పాలు పోవడం లేదు.

ప్లాంట్ లోని వాటర్ ట్యాంక్

ఇప్పటికైనా సిఎంసి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సదరు బోరును తమ అధీనంలోకి తీసుకొని బస్తివాసులకు ఉపయోగపడేలాగా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తితో దందా చేస్తున్న వారిపై, అక్రమంగా నీటి వ్యాపారానికి పాల్పడుతున్న నేపథ్యంలో వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నీటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వాహనం

ఈ విషయమే శేరిలింగంపల్లి మండల గిరిదావార్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) ఆర్ల శ్రీనును “నమస్తే శేరిలింగంపల్లి” వివరణ కోరగా అలాంటి వ్యవహారం తమ దృష్టికి రాలేదని, వెంటనే ఆర్ఆర్టీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మియాపూర్ సర్కిల్ ఉపక కమిషనర్ శశిరేఖ వివరణ కోరగా సదరు విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here