శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ పీఏసీ (PAC) చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చేయూత అంటే కేవలం పింఛన్ మాత్రమే కాదని, పేదల జీవితాలకు భరోసా కల్పించే సామాజిక భద్రత అని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ చెరువు సమీపంలో ఉన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని 1,080 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ సేవా ఇస్లావత్, యాదవ కోఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పేదలకు అండగా నిలుస్తోందన్నారు. వృద్ధులు, అవ్వాతాతలు, అసహాయులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడం, అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా నిలిపివేయకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి పింఛన్ల మంజూరుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. చేయూత పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు తోడ్పడతాయని అన్నారు. మహిళా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో మొత్తం 3,149 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. సర్కిళ్ల వారీగా లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్: 1,080 మంది, చందానగర్ సర్కిల్: 957 మంది, ఆల్విన్ కాలనీ సర్కిల్: 1,112 మందికి పింఛన్లను మంజూరు చేశారు. మొదటి విడతలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఈత, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు పింఛన్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.





