3.5 లక్షల మంది విద్యార్థులకు సైబరాబాద్ పోలీసుల చేరువ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సురక్షితమైన, ట్రాఫిక్ రద్దీ లేని సైబరాబాద్ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సైబరాబాద్ మూవ్స్-2026 కార్యక్రమానికి ముందస్తుగా నిర్వహించిన వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా 400కు పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులకు చేరువయ్యాయి.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, లైవ్ వర్చువల్ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 400కుపైగా విద్యాసంస్థలు జూమ్ ద్వారా పాల్గొనగా, మరో 200 నుంచి 300 మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీక్షించారు. పలు పాఠశాలల్లో తరగతి గదులు, సమావేశ మందిరాల్లో విద్యార్థుల కోసం సామూహిక వీక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) CEO నవీద్ ఖాన్, WRI ఫెలో శ్రీనివాస్ అల్లవల్లి సైబరాబాద్ మూవ్స్-2026 లక్ష్యాలు, ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రాధాన్యతను వివరించారు. పట్టణ రవాణా వ్యవస్థలో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలు, ప్రతిపాదనలు ఎలా అందించవచ్చో తెలియజేశారు. DCP ట్రాఫిక్–I రవి కుమార్, అడిషనల్ DCP ట్రాఫిక్ హనుమంతరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, CMC కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ.. సురక్షితమైన రహదారులు, ట్రాఫిక్ నిబంధనల అమలు, రద్దీ లేని రవాణా మార్గాల నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, ప్రజల మధ్య సమన్వయం, సమిష్టి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. సైబరాబాద్ మూవ్స్–2026 కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ట్రాఫిక్ రద్దీ లేని రవాణా వ్యవస్థ, సురక్షితమైన రహదారులు, మెరుగైన రోడ్డు క్రమశిక్షణ, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం చేపట్టిన ఉద్యమమని స్పష్టం చేశారు. నగర రవాణా సమస్యల పరిష్కారంలో విద్యార్థులు కేవలం ప్రయాణికులుగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా, మార్పుకు దోహదపడే భాగస్వాములుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ వర్చువల్ కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో, SCSC సహకారంతో అమలు చేస్తున్న స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించారు. పాఠశాలలు, తల్లిదండ్రులు, పోలీసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యార్థుల రోజువారీ ప్రయాణాలను సురక్షితంగా, క్రమబద్ధంగా మార్చడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రహదారి భద్రత, ట్రాఫిక్ రద్దీ, నిబంధనల పాటింపుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ 26 నుంచి 28 వరకు T-Hubలో నిర్వహించనున్న సైబరాబాద్ మూవ్స్–2026లో విద్యార్థులకు పలు వినూత్న అనుభవాలు అందుబాటులో ఉండనున్నాయి. భారీ ఇంటరాక్టివ్ ఫ్లోర్ మ్యాప్‌లపై తమ పాఠశాలలు, ఇళ్లు, రోజువారీ ప్రయాణ మార్గాలను గుర్తించే అవకాశం కల్పించనున్నారు. వాస్తవ మ్యాప్‌లు, డేటా ఆధారంగా భూగోళశాస్త్రం, గణితం, పౌరశాస్త్రం, పర్యావరణ శాస్త్రాలను ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

అలాగే రహదారిని సురక్షితంగా దాటడం, ఫుట్‌పాత్‌ల వినియోగం, బాధ్యతాయుతమైన ప్రయాణ విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలు, ప్రాజెక్టులను ప్రదర్శించవచ్చు. పోలీస్ అధికారులు, పట్టణ ప్రణాళిక నిపుణులు, ఇంజనీర్లు, మెట్రో, బస్సు రవాణా విభాగాల సిబ్బందితో ముఖాముఖి చర్చించే అవకాశం కూడా కల్పించనున్నారు. సైబరాబాద్ మూవ్స్–2026 ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. నవంబర్ 20: ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రతిపాదనల సమర్పణకు చివరి తేదీ కాగా, నవంబర్ 26–28: T-Hubలో సైబరాబాద్ మూవ్స్–2026 నిర్వహణ ఉంటుంది. సమయం: ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వ‌హిస్తారు. రిజిస్ట్రేషన్ల‌కు www.cyberabadmoves.in అనే సైట్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

విద్యార్థులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సురక్షితమైన, స్మార్ట్, సుస్థిరమైన సైబరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్ విభాగాలు పిలుపునిచ్చాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here