మాదాపూర్‌లో విజయ్ మిల్క్ డెయిరీ భవనం కూల్చివేతపై ఫిర్యాదు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని విజయ్ మిల్క్ డెయిరీ భవనాన్ని అనుమతులు లేకుండా కూల్చివేశారంటూ మాదాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు మల్లాల రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సంబంధిత సంస్థ యాజమాన్యం, కూల్చివేతకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. గుట్టల బేగంపేట్‌కు చెందిన మల్లాల రాజు యాదవ్ (39) వ్యాపారం చేస్తూ మాదాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మాదాపూర్ గ్రామంలోని పిల్లర్ నంబర్ C-1744 సమీపంలో ఉన్న విజయ్ మిల్క్ డెయిరీ భవనాన్ని నవంబర్ 11వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హిటాచీ ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్ సహాయంతో కూల్చివేస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది.

వెంటనే అక్కడికి చేరుకున్న రాజు యాదవ్.. హిటాచీ యంత్రంతో భవనాన్ని కూల్చివేస్తున్నట్లు గుర్తించారు. ఆ వాహనంపై CMC అని ఉన్న స్టిక్కర్‌ను గమనించారు. విచారించగా, కూల్చివేతకు పాల్పడుతున్న వారు ది క్యూబ్ బై ఫ్యూచర్ ట్రెండ్స్ అనే సంస్థకు చెందిన వారని తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎం. శ్రవణ్ కుమార్ యాదవ్, గోపాల్ ముదిరాజ్, ఎం. మహేష్ యాదవ్, పరమేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. భవనాన్ని కూల్చివేయడంపై తాము ప్రశ్నించి, పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సంబంధిత వ్యక్తులు తమను అడ్డుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. సరైన అనుమతులు లేకుండా భవనాన్ని కూల్చివేయడం, ప్రశ్నించిన వారిని దూషించడం, అడ్డుకోవడంపై సంబంధిత సంస్థ యాజమాన్యం, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here