శేరిలింగంపల్లిలో వాల్ టు వాల్ సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. డివిజన్‌లోని నెహ్రూనగర్, గోపినగర్ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్‌లోని ప్రతి బస్తీ, కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ, పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

వాల్ టు వాల్ సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా రహదారులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకు బస్తీ వాసులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న అరుగులు, ర్యాంపులను స్వచ్ఛందంగా తొలగించి పనులకు సహకరిస్తే రహదారులు విశాలంగా మారడంతోపాటు ప్రజలకు రాకపోకలు సులభతరంగా, సురక్షితంగా ఉంటాయని తెలిపారు. ఈ చర్యలు భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. గతంలో డ్రైనేజీ నెట్‌వర్క్ లేని బస్తీలలో సైతం డ్రైనేజీ పైప్‌లైన్ సౌకర్యం కల్పించి, అనంతరం నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్న మాజీ కార్పొరేటర్‌కు బస్తీ వాసులు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బీమన్ శ్రీను, వెంకటయ్య, విజయ్, స్థానిక బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here