నమస్తే శేరిలింగంపల్లి : సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గోకుల్ ప్లాట్స్, సిద్ధివినాయక నగర్, జేఎన్టీయూ కాలనీలలో రూ. 4 కోట్ల 69 లక్షల అంచనావ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని అన్నారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆదిత్య నగర్ కాలనీలో రూ.2కోట్ల 31 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, గోకుల్ ప్లాట్స్ కాలనీలో రూ.1 కోటి 55 లక్షలతో , సిద్ధివినాయక నగర్ కాలనీ రూ.39 లక్షలతో, గోకుల్ ప్లాట్స్ కాలనీ రూ.44 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.