నమస్తే శేరిలింగంపల్లి : వంట గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపి రంజిత్ రెడ్డి పిలుపుమేరకు శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచనల మేరకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్లపై ధర్నాలు, వంట వార్పు, మోదీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే, మరో వైపు గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణమన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా వెంటనే తగ్గించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అనుబంధ, బస్తి కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు కాలనీవాసులు పాల్గొన్నారు.