మార్చిలో ప్రీమియం కడితే డిసెంబర్లో పాలసీ ఇచ్చారు…ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్సు సంస్థ నిర్వాకం

  • ఆరు నెలల సేవలకు శఠగోపం, అడ్డగోలుగా వాదిస్తున్న ఏజెంట్లు

అందేవరకు కాళ్ళు…అందాక జుట్టు అన్న సామెతను కొన్ని ఇన్సూరెన్సు సంస్థలు అక్షరాలా నిజం చేస్తున్నాయి. ఇన్సూరెన్సు పాలసీలు తీసుకోండి అంటూ వినియోగదారుల చుట్టూ తిరిగే ఏజెంట్లు తీరా డబ్బులు అందగానే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని అడిగితే మాత్రం అడ్డగోలుగా వాదిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. నేటి కాలంలో చాలామంది లైఫ్ ఇన్సూరెన్సు తీసుకుని కుటుంబానికి ఆర్ధిక భద్రత ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులను నమ్మకంతో ఇన్సూరెన్సు సంస్థల్లో జీవిత భీమాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని సంస్థలు వినియోగదారుల నమ్మకానికి తూట్లు పొడుస్తున్నాయి. తీసుకున్న సొమ్ముకు సరైన సేవలు అందించక పోగా అడ్డగోలుగా వాదిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి.

మార్చ్ 18 వ తేదీన దరఖాస్తు చేసిన సమయంలో ఏజెంటు అందజేసిన రసీదు

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు చిరు వ్యాపారుల వద్దకు గత మార్చి నెలలో నరేంద్ర అనే ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్సు సంస్థకు సంబందించిన ఏజెంట్ వచ్చాడు. ఇన్సూరెన్సు సంస్థ అందించే ఆక్సిడెంట్ సురక్ష ఇన్సూరెన్సు పాలసీ సేవల గురించి, ప్రీమియం ఇతర వివరాలు వివరించి పాలసీ తీసుకునేందుకు ఒప్పించాడు. ఇద్దరి వద్ద నుండి మూడు పాలసీల ప్రీమియం డబ్బులను ఒక సంవత్సర కాలానికి గానూ నగదు, చెక్కుల రూపంలో స్వీకరించి వెళ్ళిపోయాడు. భీమా డబ్బులు అకౌంట్ల నుండి డెబిట్ అవ్వడంతో పాలసీ ప్రక్రియ ప్రారంభమైనట్లు సదరు వ్యాపారులు భావించారు. తర్వాత నెలలు గడుస్తున్నా భీమా సంబంధిత పత్రాలు పాలసీదారులకు అందలేదు. ఈ క్రమంలోనే దాదాపు 9 నెలల అనంతరం సంస్థ ప్రతినిధులు ఓ దరఖాస్తు దారుడికి ఫోన్ చేసి డబ్బులు తమకు చెల్లించినట్లు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ అందించాలని అడగడంతో పాలసీ దారుడు ఖంగుతిన్నాడు. పాలసీకి దరఖాస్తు చేసుకున్న 9 నెలల తర్వాత స్టేట్మెంట్ అడగడంతో ఆశ్చర్యపోవడం అతడి వంతయ్యింది. పాలసీ కట్టించినందుకు బాధ్యత తీసుకోవాలని పాలసీ ఇచ్చిన ఏజెంటును ప్రశ్నించగా పాలసీ కట్టించడంవరకే తమ పని అని, ఆ తర్వాత ఏదైనా సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలి అంటూ తనకేమీ సంబంధం లేనట్లు అడ్డగోలుగా వాదించడం మొదలు పెట్టాడు.  తనకు పాలసీ అవసరం లేదని, డబ్బులు వాపసు ఇవ్వాలని అడగగా ఇవ్వడం కుదరదని ఖరాకండిగా చెప్పేసారు. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వినియోగదారుడు మరోసారి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా మిగిలిన 6 నెలలకు భీమా జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

మే నెలలో ప్రీమియం చెల్లించినట్లు ద్రువీకరిస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్
  • క్లెయిమ్, ఇతర సేవల్లోనూ జాప్యమే…!

వీరిద్దరి విషయంలోనే కాకుండా ఈ సంస్థలో భీమా పొందిన ఎంతోమంది వినియోగదారులు సంస్థ సేవల విషయంలో అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఏజెంట్లు పాలసీ ఇచ్చేసమయంలో చెప్పే వివరాలకు, క్లెయిమ్ చేసుకునే సమయంలో సంస్థ ప్రతినిధులు తెలిపే నిబంధనలకు పొంతన ఉండటంలేదని, ఎలాంటి కారణాలు లేకుండానే తమ క్లెయిమ్ దరఖాస్తులని తిరస్కస్కరిస్తున్నారని వాపోతున్నారు. సంస్థ వినియోగదారుల సేవా ప్రతినిధుల వ్యవహరించే తీరుపై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యూచర్ జనరలి సంస్థ సామజిక మాధ్యమాలలో(facebook) పేజీలపై వందలాదిమంది బాధితులు తమకు ఎదురైనా అనుభవాలను రివ్యూ ల రూపంలో వెలిబుచ్చుతున్నారు.

జూన్ 2020 నుండి పాలసీ జారీ చేస్తూ డిసెంబర్ 2020 లో సంస్థ ప్రతినిధులు సంతకం చేసిన పాలసీ పత్రాలు

కన్స్యూమర్ ఫోరమ్ లో పిర్యాదు చేస్తా: ఫ్యూచర్ జనరలి బాధితుడు
ఎంతోమంది నా లాగే పాలసీ సేవల విషయంలో మోసపోయి ఏమీ చేయలేక నిట్టూర్చుతున్నారు. ఇన్సూరెన్సు సంస్థ వినియోగదారులు చెల్లించే డబ్బులకు సరైన న్యాయం చేయడం లేదు. నమ్మకంగా పాలసీలు తీసుకునే వినియోగదారులను సంస్థలు మోసగిస్తున్నాయి. కన్స్యూమర్ ఫోరమ్ లో ఈ విషయంపై పిర్యాదు చేయబోతున్న. అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇన్సూరెన్సు పాలసీలు హడావుడిగా తీసుకోవద్దు, ఇన్సూరెన్సు సంస్థల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here