నమస్తే శేరిలింగంపల్లి : పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 41 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి 616వ అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని మే 23 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం నుండి ట్యాంక్ బండ్ మీద ఉన్న అన్నమాచార్యుల విగ్రహం వరకు “మహానగర సంకీర్తన” నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణ తెలిపారు.
సాందిప్ శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో, చిరంజీవి మానస పటేల్ అన్నమయ్య వేషధారణలో విద్యార్థులు, భక్తులందరితో అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ “అన్నమయ్య గోష్ఠిగానం” నిర్వహించనున్నారు. ప్రముఖ కళాకారులు గాయత్రి నారాయణ, మానస ఆచార్య , శ్రీవాణి శైలజ అచంట, అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు పాల్గొననున్నారు. ముఖ్య అతిథులుగా పూజ్యశ్రీ రంగరాజన్ స్వామి, చిలుకూరు, ఆత్మీయ అతిథులుగా డా.అనంతలక్ష్మి, తిరునగరి జ్యోత్స్న, శ్రీ బ్నిం విచ్చేయుచున్నారు. ఇటీవల అన్నమాచార్య భావనా వాహిని నిర్వహించిన “ఆవకాయ- మాగాయ పోటీ” విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమం అనంతరం అందరికీ ఉదయం 8:30 గంటలకు హారతి, ప్రసాదం అల్పాహార వితరణ ఉండబోనున్నది.