వృద్ధాప్యంలో ఎముకల డేంజర్ బెల్స్

వ‌యసు అర‌వై దాటిందా..ఎముకల ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం

కాల్షియం లోపంతో పడిపోతున్న బోన్ డెన్సిటీ

ఆరోగ్యం(నమస్తే శేరిలింగంపల్లి): అసలే కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఈ సమయంలో బయట తిరగడమే కష్టం. అటువంటిది ఆసుపత్రులలో ఎక్కువ రోజులు గడపడం అనేది దినదిన గండమే. సాధారణంగా వయసు పైబడిన వారిలో ఎముకల సంబందించిన సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎముకల సమస్యలతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చేరే వృద్ధుల కుటుంబ సభ్యులు కరోనా కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎముకల విషయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై నమస్తే శేరిలింగంపల్లి ప్రత్యేక కథనం…”మా తాతయ్య పార్కులో వాకింగ్ చేస్తూ తూలీ పడ్డాడు, ఆసుపత్రికి తీసుకువెళ్తే కాలు ఎముక విరిగిందన్నారు” అని తన స్నేహితుడితో చెప్పాడు వరుణ్. మా అత్తయ్య బాత్రూమ్ లో కాలుజారి పడితే తుంటి ఎముక విరిగింది అంటూ పక్కింటి సునీతతో చెబుతోంది రజని. ఈ మధ్య తరచూ ఇలాంటి సంభాషణలు వింటూనే ఉంటున్నాం. చిన్న చిన్న ప్రమాదాలకు కూడా ఎముకలు చొప్ప బెండ్ల మాదిరిగా విరిగిపోతున్నాయి. యుక్త వయసు వారిలో ఎంతో దృడంగా ఉండే ఎముకలు యాభై అరవై ఏళ్లకే గుల్లబారిపోవడానికి మారిపోవడానికి కారణం ఏంటి…?వయసు మళ్లే కొద్దీ ప్రమాదాలు జరిగేం అవకాశాలు ఎక్కువ
ఒక వ్యక్తి వయస్సు మళ్లీ కొద్దీ ఎముకలలో ఉండే కాల్షియం మరియు ఫాస్పేట్ లను అతని శరీరం తనలో కలిపివేసుకోవడం ఎక్కువ అవుతుంది. దీంతో ఎముకలు శక్తిహీనం అపుతాయి. ఈ ప్రక్షియ ఎపుడైతే ఒక స్థాయిని మించితే ఆ స్థితిని ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధితో పిలుస్తారు. ఇలాంటి స్థితికి చేరుకున్న సమయంలో వృద్దులు పలు కారణాలతో వారి ఎముకలు బబహీనంగా అయ్యాయని తెలియకుండానే ప్రమాదాలకు లోనవుతారు. ఫలితంగా ఎముకల్లో పగుళ్లు, విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆస్టియో పోరోసిస్ స్థితికి చేరినవారు ప్రమాదాల వల్లనే కాకుండా ఏదైనా శరీర భాగంలో ఒత్తిడి కారణంగా కూడా ఎముకలు విరిగిపోయే ఆస్కారం ఉంది. ఇలా జరిగే వాటిలో వెన్నుపూసలో పగుళ్లు రావడం, వెన్నుముక చుట్టూ ఉండే నడుము భాగంలో ఉండే ఎముకల్లో సమస్యలు అధికంగా తలెత్తుతాయి. పలు అధ్యయనాల ప్రకారం ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు మరియు ప్రతి ఐదు మంది పురుషుల్లో ఒక్కరు ఎముకల దుర్భలత్వానికి గురవుతున్నారు.

ఇలా ఒక వ్యక్తి పడిపోవడం అంటే అనుకోకుండా, ప్రమాదవశాత్తు నేల మీద పడిపోవడం. వృద్దులలో ఇలా జరుగడానికి పలు అంశాలు కారణమవుతాయి అంటే వీటిలో వారిలోని అంతర్గత మరియు బాహ్య ప్రపంచానికి సంబందించిన అంశాలు ఇమిడి ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పడిపోవడాన్ని నిరోధించడం పై రూపొందించిన నివేదిక ప్రకారం 65 సంవత్సరముల పైబడిన వారిలో 28 నుండి 35 శాతం మంది ఏటా క్రింద పడిపోతుంటారని తెలిపింది. వీరి శాతం వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుందని కూడా వెల్లడించింది. ఇక భారత దేశానికొచ్చే సరికి 60 సంవత్సరముల పైబడిన వారిలో 14 నుంచి 53 శాతం మంది క్రిందపడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని అంచనా.

ఇలా క్రింద పడడం మరియు తద్వారా ఏర్పడే సమస్యలు అనుకోకుండా జరిగే ప్రమాదాల కోవలో రెండవ అతి పెద్ద కారణంగా పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2004 లో 424000 పడి పోయిన కేసులు అధికారిక లెక్కలు చెబితే అందులో 11 శాతం మందికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అందులో ఐదవ వంతు భారత దేశంలో జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా పడి పోవడం వలన నొప్పి లేదా భాద తెలియని లేదా తీవ్రమైన భాదతో కూడిన గాయాలు ఏర్పడడమే కాకుండా ఎముకలు విరిగిపోవడం, స్థాన భ్రంశం కావడం తో పాటూ తల పగిలిపోవడం జరుగవచ్చు ఇక చివరగా మరి కొన్ని కేసులలో మరణం సంభవించవచ్చు.

ఇలా జరుగడానికి కారణాలెన్నో. అయితే వాటిలో ప్రదానంగా వారి సామాజిక, ఆర్థికపరమైన హోదా లకు పడడానికి ఒక కీలక అంశంగా పేర్కొంటున్నారు. అలానే దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడేవారితో పాటూ కదలకుండా ఉండే జీవన శైలి కూడా ఇందుకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే గాకుండా దీనిపై జరిగిన కొన్ని పరిశోధనలలో వృద్దులు ఎక్కువగా ఉదయం పూట పడిపోవడం జరుగుతోందని తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా వారు ఉదయం పూట వారి స్వంత పనులను ఎక్కువగా చేసుకోవడం జరుగుతుందని అదీ ముఖ్యంగా బాత్ రూంలలో, వ్యాయామ గదులలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ పరిశోదనలు చెబుతున్నాయి. ఇక ఇంటి నేల తడిగా, జారుడుగా ఉండడం, సరైన వెలుతురు లేక పోవడం, బాత్ రూంలు, మెట్లపై పట్టు అందించే గ్రిల్స్ లేదా హాండిల్స్ లేక పోవడం కూడా ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. బాత్ రూం లు ప్రధానంగా వృద్దుల అవసరాలకు తగినట్లుగా రూపొందించకపోవడం అనేక సందర్భాలలో వారు పడిపోవడానికి కారణమవుతున్నాయనేది అందరూ అంగీకరించే విషయం.వీటితో పాటూ వారు వినియోగించే చక్రాల కుర్చి లేదా నడువడానికి ఉపయోగించే ఊత కర్ర వంటి వాటిని వారి కదలికలకు అనుగుణంగా ఎంపిక చేయకపోవడం వలన కూడా వృద్దులు పట్టు తప్పి పడిపోతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి సరిగా లేకపోయినందున వారు నడిచేటపుడు, కదిలేటపుడు, కుర్చీల నుండి లేచేటపుడు పట్టు తప్పి పడిపోతుంటారని, తద్వారా గాయాలకు గురవుతున్నారు.

ఇక ఇలా పదే పదే పడిపోవడం వలన ఎక్కువ కాలం హాస్పిటల్ లో గడుపడంతో పాటూ గాయం నుండి వీరి వృద్దాప్యం కారణంగా త్వరగా కోలుకోరు. ఇక నొప్పి లేదా గాయం కలుగని సందర్భాలలో ఇంటిలోని సభ్యులు వాటిని పట్టించుకోకపోవడం కారణంగా కూడా పలు సందర్భాలలో అంతర్గతంగా గాయాలు తీవ్రమై ప్రమాదాలు పెరుగుతాయి. ఇక పలు సందర్భాలలో ఎక్కడ పడిపోతామనే భయం అంటే ఫియర్ ఆఫ్ ఫాల్ కూడా వృద్దులలో ఎక్కువగా ఉండి ఊతం కోసం ఎక్కువగా ప్రయత్నం తమకు తెలియకుండానే చేసి పట్టు తప్పి పడిపోవడం కూడా జరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటన్నింటి కారణంగా వృద్దులు ఇతరులపై ఆధారపడడం, కదలడానికి బయపడడం, ఒత్తిడి మరియు ఆందోళనకు గురికావడం కూడా గమనించవచ్చు. అంటే ఒక సారి పడిపోయిన తర్వాత ఏర్పడే పలు శారీరక, మానసిక పరిస్థితుల కారణంగా భవిష్యత్తులోనూ పడిపోయే ప్రమాదం ఎక్కువై వారి జీవన శైలి నాణ్యత తగ్గిపోతుందని తేలింది.

అయితే పడి పోవడానికి గల కారణాలపై అభివృద్ది చెందుతున్న దేశాలలో పూర్తి స్థాయి గణాంకాలు లేవు. అదే అభివృద్ది చెందిన దేశాలలో దీనిపై సరైన గణాంకాలు ఉండి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇలా పడిపోవడాన్ని నిరోధించడానికి ఎన్నో చర్యలను ఈ దేశాలు తీసుకొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇలా పడి పోయి ప్రమాదాలు ఎదుర్కొంటున్న వృద్దుల సంఖ్య పెరుగుతోందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా భారత దేశం లాంటి అభివృద్ది చెందిన దేశాలు ఇకనైనా దీనిపై దృష్టి కేంద్రీకరించి తగిన కారణాలను పరిశోధించి వీటిని నిరోధించడానికి కృషి చేయాల్సి ఉంది. అయితే దీనిపై దేశంలో జరిగిన కొన్ని పరిశోధనలలో వారి ఆర్థిక సామాజిక స్థితిగతులు, అక్షరాస్యత, వివాహ పరిస్థితులు దీనికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా ఖచ్చితంగా తెలియదు. అంతే గాకుండా పడిపోతున్నామనే అపోహ, భయం కూడా ఎందుకు కలుగుతుందో కనిపెట్టాల్సి ఉంది.

చివరగా అమెరికా ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆ దేశంలో రెండింట మూడు వంతుల మరణాలు పడి పోవడం వలన జరుగుతున్నాయని అయితే వాటిని నిరోధించవచ్చని తేలుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రత్యేకంగా వృద్దుల జీవన శైలి నాణ్యతను పెంచడం పై దృష్టి కేంద్రీకరించే ప్రత్యేకం కార్యక్రమం యాక్టివ్ ఏజింగ్ చేపట్టారు. ఇకనైనా భారత దేశం అందులోనూ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో దీనిపై దృష్టి కేంద్రీకరించి వీటిని నివారిస్తుందని ఆశిద్దాం.

– Dr.Uma Sreedevi, MD, Anaesthetist & Pain Physician, Head of Department, Dept of Anaesthesiology, Aster Prime Hospital, Hyderabad

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here