శేరిలింగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం రేవంత్ రెడ్డి గతంలో బసవతారక నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పలువురు సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు స్థానికంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నారని, తాను అధికారంలోకి వస్తే వెంటనే బసవ తారక నగర్ ప్రజలకు తమ స్థలంలోనే ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు పేదల గుడిసెలను కూల్చి ఆక్రమించాలని చూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పేదలకు తమ స్థలంలోనే సొంత ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను కొందరు వ్యక్తులు మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత తంతు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు కానీ, పోలీసులు కానీ స్పందించడం లేదని, వెంటనే పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకుడు డిజి నర్సింగ్ రావు, సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, నాయకులు కృష్ణ, అతిక్, జార్జ్ కృప, అనిల్ , శ్రీనివాస్, జంగయ్య, శివుడు తదితరులు పాల్గొన్నారు.






