ఎన్నికలు అంటేనే అదో పెద్ద కోలాహలం. కొన్ని నెలల ముందు నుంచే ఎన్నికల హడావిడి మొదలవుతూ ఉంటుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగిపోతుంది. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన నాయకులు, అధికారం దక్కక సొంత పనులకు పరిమితమయ్యే ప్రతిపక్ష నాయకులు, ప్రజలకు ఎదో చేయాలనుకుని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే స్వతంత్ర అభ్యర్థులు చేతులెత్తి ప్రజలకు మొక్కేది ఇప్పుడే. ఎన్నికల్లో పాల్గొనే నాయకులు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా చివరికి వాళ్ళ భవితవ్యం మాత్రం తేల్చాల్సింది సామాన్య ఓటర్లే. చాలా తక్కువ సందర్భాల్లోనే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు మనం వింటుంటాం. నగరంలో ప్రతీ ఎన్నికలో నమోదయ్యే పోలింగ్ 50 శాతం లోపే కావడం విచారకరం. పోలింగ్ నాడు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నప్పటికీ చాలా మంది దానిని కేవలం సెలవు దినం గానే పరిగణిస్తున్నారు కానీ, ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొనేవారు చాలా తక్కువ. కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లడమో, పార్కులను సందర్శించడం, గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకోవటం తప్ప బాధ్యతాయుతమైన పనిని మెజారిటీ ఓటర్లు విస్మరిస్తున్నారు. నేనొక్కడినే ఓటెయ్యకపోతే ఫలితాలు తారుమారు అవుతాయా, గెలిచేవాళ్ళు ఓడిపోతారా అని కబుర్లు చెప్పేస్తుంటారు. దీనికి తోడు కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎందుకు రిస్క్ చేయాలని చాలామంది ఓటు వేయడానికి వెనకడుగు వేసే ఆలోచనలో ఉన్నారు.
ఎన్నికల్లో పాల్గొనే ప్రతీ అభ్యర్థికి వారు పోటీ చేసే పార్టీ బలంతో పాటు వ్యక్తిగత పరిచయస్తుల మద్దతు తప్పనిసరిగా ఉంటుంది. దీంతో పాటు వారి సొంత సామాజిక వర్గపు ఓటర్లు సైతం తమ కులానికి చెందిన వాడే నాయకుడిగా గెలవాలని అభిప్రాయ పడుతుంటారు. ఇక చివరిరోజుల్లో పార్టీల అభ్యర్థులు పంచె డబ్బు, మద్యానికి లొంగిపోయి చాలామంది ఓటర్లు తమ ఓటును అమ్మేసుకుంటున్నారు. వీరంతా ఎన్నికల్లో పాలు పంచుకునేవారు తప్ప ఫలితాలను నిర్ణయించేది వీటన్నిటికీ సంబంధం లేని తటస్థ ఓటర్లే. వీరు వేసే ఓట్లే మెజారిటీ గా మారి నాయకులను నిర్ణయిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలా తటస్తంగా ఉండే ఓటర్లే పైన చెప్పిన విధంగా మనకెందుకులే అని ఆలోచిస్తున్నారు.ఈ కారణంగానే ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సాధించిన నాయకులు సైతం సులభంగా అధికారాన్ని చేపడుతున్నారు. కొద్దిమంది ఓటర్లు మాత్రమే బాధ్యతాయుతంగా ఓటు వేస్తున్నప్పటికీ మిగిలినవారి నిర్లక్ష్యం కారణంగా ఉత్తమమైన నాయకులను ఎంపిక చేయడంలో విఫలమవుతున్నారు.
సరైన నాయకుడి ఎంపికలో ఓటర్లు విఫలమైన సందర్భాల్లో గెలిచిన నాయకుడు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, ప్రజల సమస్యలు తీర్చకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినా మనసులో తిట్టుకోవడమే తప్ప సామాన్య ప్రజలు చేసేది ఏమీ ఉండదు. ఎన్నికల్లో పాల్గొనేందుకు కేటాయించాల్సిన గంట సమయం గురించి ఆలోచిస్తే రానున్న ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఇదే సరైన సమయం. రండి ప్రజాస్వామ్యంలో మన బాధ్యతగా ఉన్న హక్కును నెరవేర్చేందుకు ఓటు వేద్దాం. పోటీలో ఉన్న వారు అనర్హులుగా భావిస్తే కనీసం NOTA కు ఐన ఓటు వేసి మన అభిప్రాయాన్ని చాటుదాం.
article courtesy by: వఝా పవన్
గమనిక: పోలింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళగలరు.