శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో 5 అంతస్థుల భవనం అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగినది. విషయం తెలియగానే సంఘటన స్థలానికి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ హమీద్ పటేల్, GHMC, DRF సిబ్బంది, పోలీసు అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. అర్థరాత్రి వరకు ఉండి సహాయక చర్యల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు భరోసాను కల్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ లో సెల్లార్ గుంతలోకి భవనం కుంగిందని తెలిపారు. ఈ క్రమంలోనే అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, సమన్వయం చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సెట్ బ్యాక్ లేకుండా పక్కన సెల్లార్ తవ్వడం వలనే పక్క భవనం ఒక వైపు వంగిపోయిందని, దీని వలన కాలనీ వాసులు భయబ్రాంతులకు గురయ్యారని అన్నారు. భవనం చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించామని, అక్రమంగా తవ్వుతున్న సెల్లార్ లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతి లేకుండా తీస్తున్న సెల్లార్లను వెంటనే ఆపివేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాలనీ వాసులు ఎటువంటి భయబ్రాంతులకు గురి కావొద్దు అని, అన్ని రకాల స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని భరోసా కల్పించారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ సెల్లార్లు తవ్వే వారి విషయంలో ఎటువంటి ఉదాసీనత పాటించకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంజనీరింగ్ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కూల్చి వేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యలో భాగంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు.