శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ బస్తీలో 2 సంవత్సరాల క్రితం నిర్మించిన 5 అంతస్థుల భవనం ఒక పక్క అకస్మాత్తుగా కుంగిపోయింది. అయినప్పటికీ తృటిలో పెను ప్రమాదం తప్పి పోయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భవనం చుట్టు పక్కల నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.
కాగా ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక నాయకులు, మాదాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు.