- నాడు వార్డు సభ్యులు..నేడు టీఆరెస్ ప్రత్యర్థులు
- అభివృద్దే మంత్రమే బలంగా అధికార పార్టీ అభ్యర్థి
- బీజెపి అభ్యర్థి ఆశలన్నీ పార్టీ బలం పైనే
- పోలింగ్ శాతం పెరిగితేనే గట్టి పోటీ
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న డివిజన్ హఫీజ్ పేట్. ఈ డివిజన్ లో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 70479 . డివిజన్ లో అభివృద్ధి చెందిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో క్లాస్ ఓటర్ల ప్రభావం ఎక్కువ. కొన్ని కాలనీలలో సెటిలర్లు, మైనారిటీలు సైతం ఎన్నికల ఫలితాలపై కొంత ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నారు. ఈ డివిజన్ లో ప్రధానంగా శాంతి నగర్, సుభాష్ నగర్, ఆల్విన్ కాలనీ, మదీనాగూడ, గంగారం, మదీనాగూడ వీకర్ సెక్షన్, ఇంజనీర్స్ ఎంక్లేవ్, హుడా కాలనీ, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జెవెల్, ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ, మైత్రి నగర్, వైశాలి నగర్, సప్తగిరి కాలనీ, ప్రజయ్ సిటీ, జనప్రియ అపార్ట్మెంట్స్, జనప్రియ నగర్, ఓల్డ్ హఫీజ్ పెట్, సాయి నగర్, యూత్ కాలనీ, అంబెడ్కర్ నగర్, వినాయక నగర్, ప్రకాష్ నగర్, భేల్ హెచ్ఐజి, రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
గత జిహెచ్ఎంసి ఎన్నికల తీరు ఇది
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ డివిజన్ నుండి 28303 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పూజిత జగదీశ్వర్ గౌడ్ నియోజక వర్గంలోనే అత్యధికంగా 17094 ఓట్లను సాధించి విజయం సాధించారు. రెండవ స్థానంలో 8475 ఓట్లతో షైనాజ్ అక్తర్ నిలువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ 2137 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
డివిజన్ నుండి ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
పూజిత జగదీశ్వర్ గౌడ్(టిఆర్ఎస్)
రాజకీయ అనుభవం లేనప్పటికీ భర్త మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ డివిజన్ కు అందించిన సేవలు, సంపాదించుకున్న అభిమానుల సహకారంతో గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా విజయం సాధించారు పూజిత జగదీశ్వర్ గౌడ్. తదనంతరం భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ డివిజన్ ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు సైతం జోరుగా చేపట్టారు. జగదీశ్వర్ గౌడ్ సైతం మాదాపూర్ తో పాటు హఫీజ్ పేట్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సతీమణికి వెన్నుదన్నుగా నిలిచాడు. విమర్శలకు తావివ్వకుండా పాలన అందించడంతో డివిజన్ లో అభిమానులను ఎక్కువగానే పొందగలిగారు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల మద్దతు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పునాదిగా మరోసారి ఎన్నికల క్షేత్రంలో అడుగు పెట్టారు పూజిత జగదీశ్వర్ గౌడ్.
బోయిని అనూష మహేష్ యాదవ్(బిజెపి)
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పేరిట బిక్షపతి యాదవ్ అన్న యువసేన ను నడిపించిన హఫీజ్ పేట్ వాసి బోయిని మహేష్ యాదవ్. జగదీశ్వర్ గౌడ్ హఫీజ్ పేట్ కార్పొరేటర్ గా ఉన్న సమయంలో వార్డ్ సభ్యుడిగా సేవలందించి రాజకీయంగా గుర్తింపు పొందాడు. స్థానికంగా సొంత సామజిక వర్గంలో సైతం పట్టు కలిగిన మహేష్ యాదవ్ శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మొవ్వ సత్యనారాయణ ప్రోద్బలంతో ఇటీవల బీజేపీ లో చేరాడు. ఆయన అండదండలతోనే హఫీజ్ పేట్ నుండి కార్పొరేటర్ గా బరిలో నిలిచే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ యాదవ్ సతీమణి అనూష మహేష్ యాదవ్ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజా క్షేత్రంలో అనుభవం లేనప్పటికీ నాయకులు, ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం లో దూసుకుపోయారు అనూష మహేష్ యాదవ్.
వీరితో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ వార్డ్ సభ్యురాలు జె.రేణుక ఆ పార్టీ అభ్యర్థి గా బరిలో ఉండగా, టిడిపి నుండి కుర్ర ధనలక్ష్మి, ఎంసిపిఐ యు అభ్యర్థిగా సుల్తానా బేగం లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
నాటి సొంత కార్యవర్గపు సభ్యులే నేడు ప్రత్యర్థులుగా…
నియోజక వర్గం పరిధిలోనే హఫీజ్ పేట్ డివిజన్ నుండి అత్యల్పంగా ఐదుగురు అభ్యరులు మాత్రమే పోటీ పడుతున్నారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ లో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో పూజిత జగదీశ్వర్ గౌడ్ ప్రత్యర్థులైన బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్, షెహనా అక్తర్ లు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జగదీశ్వర్ గౌడ్ హయాంలో వార్డు సభ్యులుగా పని చేసిన మహేష్ యాదవ్, రేణుక లు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రత్యర్థులుగా పోటీ పడటం గమనార్హం. గత పదేళ్లుగా జగదీశ్వర్ గౌడ్ అందించిన సేవలు టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన బలంగా ఉన్నాయి. బీజేపీ విషయానికి వస్తే బోయిని అనూష మహేష్ యాదవ్ కు అండగా ఉన్న మొవ్వా సత్యనారాయణ రాజకీయ వ్యూహాలు పన్నడంలో అనుభవజ్ఞుడు. బీజేపీ కి ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉన్న కారణంగా డివిజన్ లోని క్లాస్ ఓటర్లు తమకు ఓటు వేస్తారనే ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. హఫీజ్ పేట్ గ్రామస్తుడు కావడం చేత స్థానికంగా నేతలు వీరికి అండగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే బీజేపీ అభ్యర్థి టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో కారుదే పై చేయిగా కనిపిస్తుంది.