శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): నాణ్యత లేకుండా ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మించి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను, అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వలన రోజుకు కొన్ని వందల అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని, కొందరు ఐదు, ఆరు అంతస్తుల భవనాలు కట్టి వ్యాపారాలు చేస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ లో ఓ ఇంటి యజమాని GHMC శాఖ నుండి పర్మిషన్స్ లేకుండా 50 గజాలలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించి పెను ప్రమాదాన్ని సృష్టించాడని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో చిన్నచిన్న ఖాళీ స్థలాలలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి హాస్టల్స్, హోటల్స్ కు రెంటుకిచ్చి డబ్బు గడిస్తున్నారని అన్నారు. ఇలా పర్మిషన్ లేకుండా భవనాలు నిర్మించడం వలన జిహెచ్ఎంసి శాఖకు రెవెన్యూ తగ్గిపోయి తద్వారా ఆ ప్రాంతంలో సరిపడా రోడ్లు లేక, సరైన డ్రైనేజీ లేక ఎన్నో సంవత్సరాల నుండి స్థానికంగా ఉంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక నుండి అయినా జిహెచ్ఎంసి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని నీతి, నిజాయితీతో పనిచేసి పర్మిషన్స్ ఇవ్వాలని కోరారు.
ప్రమాదవశాత్తు భవనం కిందకు కుంగి విరిగిపడితే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయేవారని అన్నారు. దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందరం ఊపిరి పీల్చుకున్నామని అన్నారు. ఇకనైనా హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను, నాణ్యత లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను,హైడ్రా కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంజనేయులు సాగర్, సంతోష్, మన్యంకొండ, సరోజ రెడ్డి, మహేష్, బస్తీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.