శేరిలింగంపల్లి డివిజన్ ఓటర్లకు చేరువయ్యేదెవరో…?

  • మాస్ ఓటర్లే ఫలితాలను మలుపు తిప్పేది
  • “కీ” ఓటర్లుగా బిసి కుల సంఘాలు, మైనారిటీ వర్గాలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో శేరిలింగంపల్లి జంట స‌ర్కిళ్ల‌లో అత్యధిక అభ్యర్థులు పోటీ పడుతున్న జిహెచ్ఎంసి డివిజన్ శేరిలింగంపల్లి (106). ఇక్క‌డి నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 13 మంది బ‌రిలో నిలిచారు. చందాన‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి సర్కిళ్ల పరిధిలోని 7 డివిజన్లలో ఈ డివిజన్ 65550 మంది ఓటర్లతో, సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది. గత జిహెచ్ఎంసి ఎన్నికలతో పోలిస్తే కొద్దిమంది ఓటర్లు మారినా, సంఖ్యలో పెద్ద మార్పులు లేకపోవడం గమనార్హం. డివిజన్ పరిధిలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీలే ఎక్కువ శాతం ఉన్నాయి. ముఖ్యంగా పాపిరెడ్డి కాల‌నీ, రాజీవ్ గృహ‌క‌ల్ప‌, సంద‌య్య‌న‌గ‌ర్‌, సుర‌భికాల‌నీ, గోపిన‌గ‌ర్‌, నెహ్రూన‌గ‌ర్‌, బాపున‌గ‌ర్‌, మ‌సీద్‌బండ గ్రామం వ‌డ్డ‌ర‌బ‌స్తీ‌, చిన్న అంజ‌య్య‌న‌గ‌ర్‌, లింగంప‌ల్లి గ్రామం, తారానగ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లోని మాస్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం నుండి బిసి వర్గానికి చెందిన కొన్ని కుల సంఘాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. మైనారిటిలు సైతం ఈ డివిజ‌న్ లో కీ ఓట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ ముఖచిత్రం

గత జిహెచ్ఎంసి ఎన్నికల తీరు ఇది…!

2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంప‌ల్లి డివిజన్ నుండి పదిమంది అభ్యర్థులు పోటీ పడగా, 28051 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాల్లో 14899 ఓట్లు సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ విజయం సాధించాడు. 6269 ఓట్లతో టిడిపి అభ్యర్థి రవియాదవ్ రెండవ స్థానంలో, 5693 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కర్చర్ల ఎల్లేష్ మూడవ స్థానంలో నిలిచారు. మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 500 లోపు ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీగా భావించినప్పటికీ రాగం నాగేందర్ యాదవ్ 8630 ఓట్ల భారీ మెజారిటీతో ప్ర‌భంజ‌నం సృష్టించాడు.

ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.

టిఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్

రాగం నాగేందర్ యాదవ్(టిఆర్ఎస్)
సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ ఎన్నికల్లో రెండ‌వ సారి బ‌రిలో నిలిచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఒక‌ప్పుడు కౌన్సిల‌ర్‌గా పోటి చేసి స్వ‌ల్ప ఓట్ల‌తో ఓడిపోయిన రాగం ఆ త‌ర్వాత శేరిలింగంప‌ల్లి రాజ‌కీయాల్లో ఉత్సాహంగా కొన‌సాగుతూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రు‌చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ఎంపి స్థానాల‌కు పోటీ ప‌డిన‌ నాగేంద‌ర్ యాద‌వ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సూచ‌న మేర‌కు గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలోనే భారీ మెజారిటీతో గెలుపొంది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌‌థ‌కాల‌తో డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌తికూల వాత‌వ‌ర‌ణాన్ని ఎదుర్కొన్నారు. ప‌లు ఆరోప‌ణ‌లు, వివాదాల కార‌ణంగా, సొంత పార్టీ నేతలు సైతం రెండో ద‌ఫా రాగంకు టికెట్ రాదని ప్ర‌చారం చేశారు. పార్టీ మొద‌టి అభ్య‌ర్థుల జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో రాగం అభ్య‌ర్థిత్వం చ‌ర్చ‌కు దారితీసింది. ఐనా త‌న చేతికి బిఫామ్ రాక‌ముందె భారీ హంగామాతో ర్యాలీగా వెళ్లి పార్టీ త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లు చేసిన రాగం కొద్ది గంటల్లోనే రెండో జాబితాలో స్థానం ద‌క్చించుకుని త‌న స‌త్తా ఎంటో నిరూపించుకున్నాడు.

బిజెపి అభ్యర్థి కర్చర్ల ఎల్లేష్

కర్చర్ల ఎల్లేష్(బిజెపి)
సామాన్య నాయీబ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఎల్లేష్ గతంలో టిడిపి కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ డివిజన్ యువతలో కొంత క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. దీంతో అప్పటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కుడు ఎం.రవికుమార్ యాదవ్ ఎల్లేష్‌ను చేరదీసి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవ‌కాశం క‌ల్పించాడు. ఆ ఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్‌, అటు టీడిపీల‌తో పోటి ప‌డి మూడవ స్థానంలో నిలిచాడు. ఐన‌ప్ప‌టికి దాదాపు 5700 ఓట్లు సాధించిన ఎల్లేష్‌ స్థానికంగా కొంత గుర్తింపు ద‌క్కించుకున్నాడు. తాజాగా మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్ ఆయ‌న త‌న‌యుడు రవికుమార్ యాదవ్‌ల‌‌తో పాటుగా బీజేపీ లో చేరాడు. అప్పటికే బిజెపిలో టిక్కెట్ కోసం కుమార్ యాద‌వ్‌, రాజు శెట్టి త‌దిత‌రుల మ‌ధ్య పోటి కొన‌సాగుతుండ‌గా నిజామాబాద్ ఎంపి అర‌వింద్ పూర్తి స‌హ‌కారంతో భాజాపా టికెట్ ద‌క్కించుకున్నాడు. నిన్నమొన్నటి వరకు తోడుగా ఉన్న కాంగ్రెస్ అనుచరగణం, స్థానిక బిజెపి నేతల అండ‌తో ఎన్నికలలో ముందుకు సాగుతున్నాడు.

బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు

శేరిలింగంప‌ల్లిలో టిఆర్ఎస్ వ్యవస్థాపక ఉద్యమనేత‌ మల్లికార్జున శర్మ కుమారుడు శివకుమార్‌. గ‌తంలో టిఆర్ఎస్‌లో ప‌నిచేసిన శివ‌కుమార్ ఇటీవ‌ల బీజేపీలో చేరి డివిజ‌న్ కార్పొరేట‌ర్ టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డాడు. చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ బిఫామ్ తెచ్చుకున్నాడు. ఇక టీడీపీ నుండి పోటీ చేస్తున్న ఏరువ సాంబశివ రావు, ఎంసిపిఐ యు అభ్యర్థి మధుసూదన్, అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి యాసీన్ బాషా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గుంజి వాసు (పెన్ డ్రైవ్), నల్లగంటి మల్లేశం(కత్తెర), ఎం.ప్రేమ్ కుమార్(ఆపిల్), బి.విజయలక్ష్మి (టార్చ్ ), కె.శ్రీనివాస్(బకెట్), డి.సతీష్ కుమార్(ఎన్వలప్), శ్యామ్యూల్ (క్యారం బోర్డు) లకు డివిజన్‌లో అంగబలం, అర్థబలం లేకున్నప్పటికీ అవకాశం ఇస్తే తామేంటో నిరూపించుకుంటామని, సాంప్రదాయ రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని అంతం చేయాలనే నినాదం తో ముందుకు సాగుతున్నారు.

అదరగొడుతున్న కారు…”అర”విరిసిన కమలం

ప్రతికూల ప‌రిస్థితుల‌ను సైతం త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంతో దిట్ట‌గా పేరొందిన రాగం నాగేంద‌ర్ యాద‌వ్ ఈ ఎన్నిక‌ల్లోను వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాడు. తాజా పరిస్థితుల ప్రకారం పలు కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలను, బ‌ల‌మైన నేత‌ల‌ను ఆకర్షించి త‌క్కువ స‌మ‌యంలోనే టీఆర్ఎస్ శిబిరాన్ని ప‌టిష్టంగా మార్చుకున్నాడు. గత ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రవి యాదవ్ సోద‌రులు ఈ ఎన్నికల్లో రాగం కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం విశేషం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం, అధికార టిఆర్ఎస్ పార్టీ పై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో మాత్రం ఈ అంశాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో స్థానిక బిజెపి అభ్య‌ర్థి ఎల్లేష్ కొంత‌ వెనుక‌బ‌డ్డాడ‌నే చెప్పొచ్చు. నియోజ‌క‌వ‌ర్గంలోని మిగిలిన డివిజ‌న్‌ల‌తో పోల్చితే శేరిలింగంప‌ల్లిలో బిజెపి గేరు మార్చాల్సిన అవసరం ఉంది. డివిజ‌న్‌లో గెలుపును నిర్దేశించేది బ‌స్తీలే అయినా బిజెపి ప్రభావిత క్లాస్ ఓటర్ల ప్రభావమూ లేకపోలేదు. మరోవైపు స్థానికంగా కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నేత లేక‌పోవ‌డంతో బ‌స్తీల్లోని మైనారిటీలంతా గంప‌గుత్త‌గా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైతే బిజెపికి కలిసొచ్చే అవకాశం ఉంది.  చివరి రెండురోజుల ప్రచార పర్వంలో ప్రధాన పోటీదారులు ఎంతమేర డివిజన్ ఓటర్ల మెప్పు పొందుతారో వేచి చూడాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here