- కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
ఢిల్లీ (నమస్తే శేరిలింగంపల్లి): జనవరి నెలలో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2021 ఆరంభంలో దేశంలో పలు మార్గాలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కాగా దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు నిపుణుల బృందాలు వ్యూహాలను రచిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే డిసెంబర్ వరకు వ్యాక్సిన్ వస్తుందని చెప్పిన తరుణంలో తాజాగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహిస్తుండగా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్, జైడస్ కాడిలాకు చెందిన జై కోవ్ డి వ్యాక్సిన్లకు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక రష్యాకు చెందిన స్పుత్‌నిక్ వ్యాక్సిన్ కు ట్రయల్స్ నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నాలు చేస్తోంది.