న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన ముఖ్యమంత్రి పదవికి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసిన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి రాజీనామా లేఖను అందజేశారు.
కాగా అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐతోపాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసి లిక్కర్ స్కామ్‌లో భాగంగా విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చాలా కాలం పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్‌లో ఉన్నారు. ఆయనకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అలాగే చాలా రోజుల పాటు జైలులో ఉన్న తరువాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈమధ్యే బెయిల్ వచ్చింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంతకాలం పాటు జైలులో ఉన్నారు. అయితే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో వారి పార్టీకి చెందిన అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది.