నమస్తే శేరిలింగంపల్లి: మన ఊరి మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్న మన ఊరు మన బడి కార్యక్రమం పై టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఏఈలు విక్రమ్, శ్యామ్, పాఠశాలల హెచ్ ఎం లతో సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే గాంధీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలోని 24 ప్రభుత్వ పాఠశాలలకు రూ. 4.82 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో ముఖ్యంగా మేజర్ అండ్ మైనర్ రిపేర్లు కాంపౌండ్ వాల్ , క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ , కిచెన్ షెడ్ వంటి పనుల నిర్మాణం మరమ్మత్తులు, యూడీఐఎస్ఈ కింద పెయింటింగ్, ఫర్నిచర్, చాక్ బోర్డ్, డిజిటల్ రూమ్స్, వంటి పనులు చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపించడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరిచి, పారదర్శకంగా నిధులను ఖర్చు చేయాలని, అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుందని అన్నారు. ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్ లైన్ లో పొందుపరచటం జరిగిందని, ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు వారం రోజుల్లో పూర్తి చేయాలి అని చెప్పారు.