నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి దేవుని చెరువు వద్ద జరిగిన వివాదం పట్ల గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో జరిగిన ఘటన అని, దీన్ని సరిదిద్దుకుంటామని అన్నారు. గౌలిదొడ్డి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి నాయకులు తీసుకున్న మీ సమస్య పై – మా పోరాటం అనే కార్యక్రమంలో భాగంగా మా పార్టీ నాయకులు స్థానిక కార్పొరేటర్ నైనా నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా చెరువుల సందర్శనకు వచ్చారని, ఒక చెరువుకు వెళ్లాల్సిన వారు పొరపాటున తన కార్యాలయం వద్ద ఉన్న చెరువుకు వచ్చి ఫోటోలు తీస్తుంటే కొందరు గ్రామస్తులు వచ్చి, ఇక్కడ మీకేం పని, ఫోటోలు ఎందుకు తీస్తున్నారని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఆ క్రమంలో ఇరువర్గాలు గొడవ పడ్డారనే సమాచారం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి గొడవ సద్దుమణిగేలా చేశామన్నారు. గ్రామస్తులకు మా పార్టీ నాయకులకు మద్య జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ డివిజన్ లో పార్టీ పటిష్టంగా ఉందని దీన్నీ ఓర్వలేక కొందరు మా మధ్య విబేధాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పార్టీ చూసుకుంటుందని తెలిపారు. ఏదిఏమైనా గొడవ జరగడం విచారకరమని ఈ విషయం పై పార్టీలో చర్చించుకుంటామని, తనకు సంబంధం లేకపోయినా, స్థానిక కార్పొరేటర్ గా వివరణ ఇస్తున్నానని తెలిపారు.