నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ పరిధిలో గృహ అవసరం కోసం అనుమతి పొందిన భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు (రెసిడెన్షియల్ టు కమర్షియల్) నిర్వహిస్తున్న భవన యజమానులు డిసెంబర్ 31 లోగా తమ భవన వినియోగ క్యాటగిరిని మార్చుకునే అవకాశం కల్పించడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్ లైన్ లోనే క్యాటగిరిని మార్చుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడువు తేదీ లోపు సకాలంలో మార్చుకోవాలని, భవన వినియోగ మార్పు కోసం గడువులోగా స్వీయ ధృవీకరణ ఇచ్చి దరఖాస్తు సమయంలోనే మొత్తం ఫీజు చెల్లించేవారికి 10శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో 50శాతం ఫీజు చెల్లించి మిగతా సగాన్ని వచ్చే ఏడాది మార్చి 31 లోగా చెల్లించవచ్చున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారికి రాయితీ ఉండదని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా https://cr.ghmc.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి కమర్షియల్ యూసేజ్ అప్లికేషన్ అనే అప్షన్ ను ఎంచుకోవాలని సూచించారు. ఓటీపి ని ఎంటర్ చేశాక డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి వివరాలు నమోదయ్యాక ఫీజులను చెల్లించాలన్నారు. చలాన్లను జనరేట్ చేసి అందులో సూచించిన అకౌంట్ కు నిఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చని, పేమెంట్ ఓకే ఆయిన తర్వాత డౌన్ లోడ్ అప్షన్ పై క్లిక్ చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ను పొందవచ్చునని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. నివాస భవనాల వినియోగ మార్పు కోసం స్వీయ ధ్రువీకరణ ఇచ్చేందుకు వాణిజ్య కార్యకపాలను మూడు క్యాటగిరీలుగా విభజించారన్నారు. బేకరీలు, బ్యాంకులు, ఐటీ ఆఫీసులు, జిమ్ లు, గెస్ట్ హౌస్ లు, నర్సింగ్ హోమ్ లు , విద్యాసంస్థలు తదితర 13 రకాల వ్యాపార కార్యకలాపాలను తొలి క్యాటగిరిలో చేర్చడం జరిగిందన్నారు. పబ్ లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, జ్యూవెలరీ షాప్ లు, వస్త్ర దుకాణాలు, డిగ్రీ కాలేజీలు తదితర ఎనిమిది వ్యాపార కార్యకలాపాలను రెండో క్యాటగిరి లో పొందుపరచారని, సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, గోడౌన్స్, ఫంక్షన్ హాళ్లు వంటి వ్యాపార కార్యక్రమాలను మూడో క్యాటగిరి లో చేర్చడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో భవన వినియోగ మార్పు కోసం యాజమానులు 1.25 శాతం లేదా 1.50 శాతం ఇంపాక్ట్ ఫీజు తో పాటు 33 శాతం కాంపౌండ్ ఫీజు ను కూడా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొంటున్నారు.