నమస్తే శేరిలింగంపల్లి:వీధి వ్యాపారుల కోసం అన్ని రకాల వసతులతో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వీధి వ్యాపారుల ఇబ్బందులు తీరినట్లేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయాన్ని శుక్రవారం స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ తో పాటు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరఘునాథ్ రెడ్డి, డీసీ సుధాంష్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన చిన్న చితక వీధి వ్యాపారాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులతో ఈ ప్రాంతంలో వ్యాపారుల సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైల్వే స్టేషన్ పక్కనే వ్యాపార సముదాయం ఉండడంతో వ్యాపారులకు, కొనుగోలు దారులకు, ఆయా కాలనీల వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ప్రస్తుతం 120 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించగా మరింత మందికి అవకాశం కల్పించేలా ఈ సముదాయాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు పద్మారావు, రవీందర్ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి, జహీర్ ఖాన్, వరలక్ష్మి, భవాని, పార్వతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.