నగరంలో మరో పరువు హత్య
– ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యుల తిరస్కారం
– గచ్చిబౌలిలో కిడ్నాప్… సంగారెడ్డిలో యువకుడి మృతదేహం లభ్యం
– తండ్రి సూత్రధారి.. మేనమామ పాత్రధారి… అంటూ మృతుడి కుటుంబం ఫిర్యాదు
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఆ ఇద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకున్నారు. కలసి జీవిద్దామనుకుని పెళ్లి చేసుకున్నారు. అందుకు పెద్దలను కూడా ఎదిరించారు. ఆస్తిపాస్తులను కూడా వదులుకున్నారు. ఎట్టకేలకు ఒక్కటయ్యారు. కానీ ఆ విషయం పెద్దలకు నచ్చలేదు. దీంతో వారు దారుణానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకున్న యువతికి చెందిన కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా హింసించి చంపేశారు. ఈ అమానవీయ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చందానగర్‌లో నివాసం ఉండే లక్ష్మారెడ్డి స్థానికంగా రేషన్ డీలర్, బిల్డింగ్ మెటీరియల్ సప్లయిర్. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం. కూతురు అవంతి 2018లో బీటెక్ పూర్తి చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటురు జిల్లా పిడుగురాళ్లకు చెందిన హేమంత్ కుటుంబం నగరానికి వలసవచ్చి చాలా ఏళ్లుగా లక్ష్మారెడ్డి ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. 2013లో డిగ్రీ పూర్తి చేసిన హేమంత్ సొంతంగా ఇంటీరియర్ పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం హేమంత్, అవంతిలకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. హేమంత్ కుటుంబం వారి పెళ్లికి అంగీకరించినప్పటికీ లక్ష్మారెడ్డి ఒప్పుకోలేదు. దీంతో అవంతి కుటుంబ సభ్యులు గతేడాది నవంబర్ నుంచి ఆమెను ఇంట్లోనే బంధించారు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో హేమంత్, అవంతిలు జూన్ 10వ తేదీన స్థానిక బీహెచ్ఈఎల్ సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓస్ కాలనీలో వారు నివాసం ఉండడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్న లక్ష్మారెడ్డి పథకం ప్రకారం హేమంత్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు.
పట్ట పగలే కిడ్నాప్…
పెళ్లి అనంతరం హేమంత్, అవంతిలు గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిపై పగబట్టిన లక్ష్మారెడ్డి అనుకూలమైన సమయం కోసం ఎదురచూశాడు. ఈ క్రమంలోనే అవంతి పెద్ద మేనమామ విజయేందర్ రెడ్డి తమ నివాసం పరిసరాల్లో తిరగడాన్ని అవంతి గుర్తించింది. ఈ క్రమంలోనే లక్ష్మారెడ్డి గురువారం హేమంత్‌ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ చేశాడు. అవంతి చిన్న మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు 10 మంది మధ్యాహ్నం ప్రాంతంలో ఇంటికి వచ్చి హేమంత్, అవంతిలను బలవంతంగా లాక్కెళ్లారు. కాగా ఇరువురు కారులోనుంచి దూకేయగా తిరిగి బలవంతంగా హేమంత్‌ను కారులోకి ఎక్కించుకుని ఓఆర్ఆర్ వైపు తీసుకెళ్లారు. దీంతో అవంతి 100 నంబర్‌కు సమాచారం అందించగా పోలీసులు రంగంలోకి దిగారు.
కిష్టాయగూడెంలో మృతదేహం…
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహం లభ్యమైంది. హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం నుంచి మృతదేహాన్ని హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. సంగారెడ్డి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హేమంత్‌ను ఎలా హత్య చేశారు ? ఎంత మంది ఈ హత్యలో భాగస్వామ్యులు అయ్యారు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలువురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. యుగంధర్ రెడ్డి, రంజిత్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సందీప్ రెడ్డి, రజిత, స్పందనతో పాటు మరికొందరు హత్యకు కారకులు అంటూ హేమంత్ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆస్తులు అన్నీ తిరిగి రాయించుకున్నారు…
హేమంత్, అవంతిలు వివాహం చేసుకున్న నాటి నుంచి వారికి తండ్రి లక్ష్మారెడ్డి, అతని బంధువుల నుంచి వేధింపులు తప్పలేదు. ఆస్తి కోసమే తమ బిడ్డను ట్రాప్ చేశాడంటూ వేధించడంతో హేమంత్ కుటుంబం ఆ ఆస్తులు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా అవంతి పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తమ పేరిట రాయించుకున్నారు. ఇక తమకు ఏ సమస్య ఉండదని హేమంత్ అవంతిలు బావిస్తున్న తరుణంలో ఈ దారుణ హత్య వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
అంతస్థుల మధ్య తేడానే హత్యకు దారి…
లక్ష్మారెడ్డిది స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. ఆస్తులు, అంతస్థులు బాగానే ఉన్నాయి. అయితే హేమంత్ కుటుంబ సభ్యులు కులం పరంగా ఆర్యవైశ్యులు. కులం విషయంలో మొదట్లో కొంత రాజీ పడినట్టు అనిపించినప్పటికి ఆస్తుల విషయంలో హేమంత్ కుటుంబం చాలా వెనకబడి ఉండడంతో కథ మొదటికొచ్చింది. గుంటూరు నుంచి వలస వచ్చిన వారి కుటుంబం స్థానికంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. హేమంత్ తల్లి బ్యూటీ పార్లర్ నడుపుతుంది. దీంతో తమ తాహతకు ఏమాత్రం సరిపోని వారితో వియ్యం అందుకోవడాన్ని లక్ష్మారెడ్డి వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారిలోని ఆ భావన హత్యకు దారి తీసింది.
చాలా దారుణం