నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఒక వైపు రాష్ట్ర వ్యాప్తంగా దూసుకు పోతుంటే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం రోజు రోజుకు వెనక బడిపోతుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ, తమ నేతల్లో సమన్యయం కొరవడి అదే ప్రజల్లో నవ్వుల పాలు అవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత తెలుగు దేశానికి, ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది శేరిలింగంపల్లి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలహీనంగా ఉన్నా కూడా స్థానిక నాయకత్వ పోరాట ప్రతిమతో మొదటి నుంచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటూ వచ్చింది. ఐతే ఇటీవలి కాలంలో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారి పోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరగడంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో ఐక్యత కొరవడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పక్కన పెడితే సొంత పార్టీ నేతలే కుమ్ములాడుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
భారతీయ జనతా పార్టీలో నియోజకవర్గాల ఇంచార్జీ వ్యవస్థ అంటూ ఏదీ లేదని, కన్వీనర్ల నేతృత్వంలోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవలే మీడియాకు వివరించారు. ఐతే నియోజకవర్గానికి కన్వీనర్ అనే వాడు లేక పోవడంతో ఆశావాహులు రెచ్చిపోయారు. తమ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. పార్టీ ఎదుగుదలే ముఖ్యమని బావించిన సిసలైన కార్యకర్తలు ఒక నాయకుడి వద్దకు వెళితే మరో నాయకుడితో తలనొప్పి అని అయోమయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఐతే ఎట్టకేలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమిస్తూ ఇటీవల అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో ఇకనైనా పార్టీ బలపడుతుందని కార్యకర్తలు బావించారు. కానీ పరిస్థితుల్లో మార్పు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
నియోజకవర్గానికి ఇంచార్జీగా చెప్పుకుంటున్న ఒక నాయకుడు, చందానగర్‌లో ఇటీవల పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ఓ ప్రాంగణంలో సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించాడు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను తాను పరిశీలించానని, అక్కడి పరిస్థితులను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేది ఆయన ఆలోచన. అది ఆహ్వానించ దగ్గ విషయం. ఐతే ఇక్కడ ఒక ప్రజా సమస్యపైన పోరాటం చేయాలనుకున్నప్పుడు ముందు పార్టీలోని నేతల మధ్య సమన్వయం అవసరం. కానీ తనకు అనుకూల మైన కొందరు డివిజన్ అధ్యక్షులు, నాయకులతో మాత్రమే మీడియా సమావేశం నిర్వహించడం విడ్డూరం. ఒక సమస్యపై ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర, జిల్లా, డివిజన్, బస్తీ స్థాయి నేతలను సంప్రదించి, వారందరితో సమన్వయం చేసుకుని ముందుకు సాగితే ఆ సమస్య పరిష్కారం అయినా, కాకపోయినా మా బాదలపై స్పందించేందుకు ప్రతిపక్షం బలంగా ఉందని ప్రజలు విశ్వసిస్తారు. ఐతే ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం, ముఖ్య నేతలను విస్మరించి, మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి పార్టీ నియమించిన కన్వీనర్‌కు సైతం కనీస సమాచారం ఇవ్వకుండా ప్రేస్ మీట్ పెట్టడం ఏంటని సొంత పార్టీ కార్యకర్తలే మండి పడుతున్నారు.
ఇటీవలి కాలంలో శేరిలింగంపల్లిలో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. నియోజకవర్గంలోని 10 డివిజన్‌లలో ఏకంగా తొమ్మది డివిజన్‌లను కైవసం చేసుకుని పటిష్టంగా తయారయ్యింది. దానికి తోడు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. విప్‌గా భాద్యతలు నిర్వహిస్తూ బలమైన నేతగా మారారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీలోని నేతలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలంతా భేషజాలు పక్కన పెట్టి సమిష్టి కృషితో పోరాడితే తప్పా టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదు. అలాంటిది ఎవడికి వాడే యమునా తీరు అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలకు మరింత దూరం అవ్వడం ఖాయం. రాష్ట్ర పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందా, లేక చేతులెత్తేస్తుందా వేచి చూడాల్సిందే.