- సైబరాబాద్ కమిషనరేట్‌లో జనవరి ‘ఆపరేషన్ స్మైల్’
- 829 మందిని గుర్తించిన పోలీసులు
- ఇందులో 245 మంది చిన్నారులు ఇతర రాష్ట్రాల వారే
- మొత్తం 149 కేసులు నమోదు
- పిల్లలతో పనులు చేయిస్తున్న తల్లి దండ్రులకు కౌన్సిలింగ్
- తల్లి దండ్రుల చెంతకు 800 మందిసంరక్షణ కేంద్రాలకు 29 మంది తరలింపు
నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ అనాథ పిల్లలకు అండగా నిలిచింది. కొన్ని నెలలుగా దుర్భర జీవితం గడుపుతూ వారు పడుతున్న నరకయాతన నుంచి భిక్షాటన, ర్యాగ్ పికింగ్, బాల కార్మికులకు విముక్తి కల్పించి రక్షగా నిలబడింది. కొన్ని నెలలుగా అనుభవిస్తున్న దుర్భర జీవితానికి సంకెళ్లు తొలగించి వారిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. సైబరాబాద్ పోలీసులు మొత్తం 9 బృందాలుగా ఏర్పాటై జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహించి మొత్తం (829) చిన్నారులను రక్షించారు. వీరిలో (487) బాలురు (87) బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు 245 మంది, బాలికలు (10) ఉన్నారు. చిన్నారులతో పనులు చేయించుకున్న వారిపై 149 కేసులు నమోదు చేశారు. డీసీపీయూ సమక్షంలో 829 మంది చిన్నారులలో 800 మందిని తమ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను వారికి అప్పగించారు. 29 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
- ఇందులో ముఖ్యమైనవి
- మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫీ కాలనీలో ఇంతియాజ్(41) తన బ్యాంగిల్స్ కంపెనీలో ఆరుగురు పిల్లలతో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయించుకుంటూ, నెలకు రూ. 6 వేలు వేతనం ఇస్తున్నాడు. ఆ పిల్లలను ఏడు నెలల క్రితం బీహార్ నుంచి తీసుకొచ్చి అప్పటి నుంచి పనిచేయించుకుంటున్నాడు. చైల్డ్ లైన్ అధికారుల దాడిలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇంతియాజ్ పై కేసు నమోదు చేసి పిల్లలను హైదరాబాద్‌లోని సైదాబాద్ హోంకు అప్పగించారు.
- డీసీపీయూ సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో కలిసి బహదూర్‌పల్లి, దుండిగల్‌లో చేపట్టిన తనిఖీల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్ఆర్ డిజైనర్ టైల్స్‌లో గత ఆరు నెలలుగా ప్రతి రోజు 10 గంటల పాటు ఇద్దరు చిన్నారులు పనిచేస్తున్నారు. ఆ పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం లేదని, వీరికి ఇచ్చే వేతనాలు కూడా సక్రమంగా లేవని విచారణలో తేలింది.
- మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ బొల్లారంలోని విఘ్నేష్ కొబ్బరి, నిమ్మకాయల దుకాణంలో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి గత నెల రోజులుగా పని చేస్తున్నాడు. బాధిత బాలుడి తండ్రి ఆరు నెలల క్రితమే మృతి చెందాడని, చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక సమస్యల కారణంగా ఆ చిన్నారి చదువు ఆగిపోయిందని విచారణలో తేలింది. చిన్నారిని అతని తల్లికి అప్పగించి పాఠశాలలో చేర్చారు.
- జీడిమెట్లలో 14 మంది పిల్లలతో ర్యాగ్ పికింగ్ చేయిస్తున్నట్లు గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జీడిమెట్ల మున్సిపల్ గ్రౌండ్ సమీపంలోని గుడిసెలలో ఉంటున్నట్లు విచారణలో తేలింది.
- సన్‌సిటీలోని సూపర్ మార్కెట్ల వద్ద నార్సింగిలో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న ఆరుగురు చిన్నారులను గుర్తించారు. తమ తల్లిదండ్రులే భిక్షాటన చేయిస్తుడడంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మల్లి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వీరు సన్ సిటీ సాయి బాలాజీ నగర్ సమీపంలోని హట్స్‌లో నివసిస్తున్నారు.