నమస్తే శేరిలింగంపల్లి: తాగిన మైకం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపోద్రేకం ఓ వ్యక్తిని హత్య చేసేలా ఉసిగొల్పింది. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారైనా మాటా మాటా పెరిగి చివరకు చంపుకునే వరకు వెళ్లారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ 9వ వీధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం… న్యూ హఫీజ్‌పేట్ మార్తాండ నగర్‌కు చెందిన షేక్ ఫరీద్(42) స్థానికంగా డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ప్రేమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ స్థానకంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరు ఇరువురు కలసి తరచూ మధ్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పరస్పరం గోడవ పడుతూ ఉంటారు. ఈ నెపథ్యంలోనే సోమవారం సాయంత్రం సైతం ఇరువురు కలసి మధ్యం సేవించారు. ఎప్పటిలాగే పరస్పరం గొడవకు దిగారు. ఐతే కోపోద్రీకుడైన మహబూబ్ బండరాయితో ఫరీద్ తలపై మోదాడు. భారీ గాయంతో తీవ్ర రక్తస్రావమైన ఫరీద్ ఘటనా స్థలంలోనే శ్వాస విడిచాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. కాగా ఫరీద్ మృతితో అతని భార్య ఇద్దరు కుమార్తెలు రోడ్డున పడ్డారు. చిన్నగా మొదలైన గొడవ చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
