- అధికారిక సమావేశాలలో మహిళ కార్పొరేటర్లతో వారి భర్తలు పాల్గొనడమేమిటి?
- జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసి అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళ కార్పొరేటర్లతోపాటు వారి భర్తలు పాల్గొన్నారు. ఇది చట్ట విరుద్ధమని, మహిళలను అవమానించడమేనని, ఈ విషయాన్ని ఖండించి చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.
ఇలాంటి సమావేశాలను ఇలా అనుమతి ఇస్తే రేపు కౌన్సిల్ సమావేశంలోనూ ఇలాగే జరుగుతుందని, పురుష కార్పొరేటర్లతో పాటు వారి భార్యలను కూడా అనుమతి ఇస్తారా? ఇలా చేసుకుంటూ పోతే మహిళ రిజర్వేషన్ కు,మహిళ సాధికారితకు విలువ ఎక్కడిది? ఒక మహిళగా, మాజీ కార్పొరేటర్ గా, అడ్వకేట్ గా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ సంఘటనలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నూ జరుగుతున్నాయని, ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అధికారుల దగ్గరకు పోయినప్పుడు వారి భర్తలు కూడా వెళ్తున్నారని, దీన్ని కూడా ఆపవలసి ఉందని పేర్కొన్నారు.