గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో దర్గాలోని మెహ్ఫిల్ ఎక్స్ రోడ్డు వద్ద బ్రాండెన్ జీన్స్ షాప్ ఎదుట ఒక వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, అతని తలపై బండరాయితో మోది అతన్ని ఎవరో హత్య చేసి ఉంటారని, అనంతరం తెచ్చి అక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారుగా 35 – 40 సంవత్సరాల వరకు ఉంటుందని, మృతుడి శరీరంపై తెల్లని చారల చొక్కా, ఎరుపు, నీలం రంగు బనియన్, బూడిద రంగు ప్యాంట్, చాకొలెట్ రంగు బెల్ట్, ప్యారగన్ చెప్పులు ధరించి ఉన్నాడని, శరీరం మీద ఎడమ ఛాతిపై శ్రీలత అని, ఎడమ చేతిపై వనజ, కుడి చేతిపై చిన్ని, హనుష అని పచ్చ బొట్లతో పేర్లు రాసి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.