- ఐదవరోజు ఘనంగ శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- పూర్ణాహుతి, చక్రతీర్థం స్థానం, ధ్వజావరోహణం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత వెంకటేశ్వర ఆలయ సముదాయంలో శ్రీవారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు, రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి పర్యవేక్షణలో నిత్యోపాసనం, పూర్ణాహుతి, ఉత్సవాన్తస్నపనము, స్వామివారి పుష్కరిణిలో శ్రీ చక్రతీర్థ స్నానం, ధ్వజావరోహణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు వేలంపాట వేశారు.
సాయంసంధ్య వేళ కన్నుల పండువగా రథోత్సవం నిర్వహించారు. పద్మావతి గోదాదేవి సమేతుడై శ్రీనివాసుడు చందానగర్ పురవీధుల్లో ఊరేగారు. స్థానిక భక్తులు ఉత్సవ మూర్తులకు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు దేవేందర్ రెడ్డి, గోపాల కృష్ణ రావు, దక్షిణామూర్తి, సుందరరాజు శెట్టిలు స్వామివారి రథోత్సవం సేవలో భాగస్వాం అయ్యారు. ఆలయ మహారాజ పోషకులు కలిదిండి సత్యనారాయణ రాజు ఝాన్సీ లక్ష్మి దంపతులు శ్రీవారికి అన్నసమారాధన జరిపించారు. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.