- హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
- సంకల్ప్ ఫౌండేషన్‌కు గాంధీ రూ.50వేల సహాయం అందజేత
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సంకల్ప్ ఫౌండేషన్ లో ఫౌండేషన్ ఛైర్ పర్సన్ రోజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనాథ యువతి మౌనిక వివాహానికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్బంగా గాంధీ, శ్రీకాంత్‌లు నూతన వధూవరులు మౌనిక, నరేందర్‌లను ఆశీర్వదించారు. అనంతరం వివాహ ఖర్చుల నిమిత్తం సంకల్ప్ ఫౌండేషన్ కి ప్రభుత్వ విప్ గాంధీ రూ.50వేలను సహాయంగా అందజేశారు.
ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సంకల్ప్ ఫౌండేషన్ ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పిస్తుందని, వారి జీవితానికి ఒక దారి చూపిస్తుందని కొనియాడారు. అలాగే ఫౌండేషన్‌కు చెందిన యువతులకు ఛైర్ పర్సన్ రోజీ ఒక సోదరిలా, తల్లిలా వివాహాలు జరిపిస్తున్నారని అభినందించారు. నూతన వధూవరులకు, సంకల్ప్ ఫౌండేషన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని, వారికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.