జ‌నప్రియ వెస్ట్ సిటీ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని జ‌నప్రియ వెస్ట్ సిటీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జ‌నప్రియ వెస్ట్ సిటీ కాలనీ వాసులు బుధవారం ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనతోపాటు ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే జ‌నప్రియ వెస్ట్ సిటీలో స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. సమస్యల తీవ్రత, ప్రాధాన్యత ఆధారంగా విడతల వారీగా పరిష్కార చర్యలు చేపడతామన్నారు. వివిధ కాలనీల ప్రజల నుంచి అందిన వినతులు, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని, PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్‌లో అత్యవసరమైన, నిత్యం సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, జ‌నప్రియ వెస్ట్ సిటీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచిస్తామన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీకాంత్ తెలిపారు. మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, ఉమ్మడి మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ‌నప్రియ వెస్ట్ సిటీ కాలనీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, ప్రసాద్, భాస్కర్ రావు, రామలింగం గౌడ్, శంకర్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here