శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): నగర జీవనశైలిలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వర్క్ ఫ్రమ్ పార్క్ కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మసీద్‌బండలో ఉన్న మాధవ హిల్స్ పార్క్‌ను ఆధునిక పని ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదిత కార్యక్రమాలను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన ఆదేశాల మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఐటీ నిపుణులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ బృందాలు ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో తమ విధులు నిర్వహించుకునేలా ఆధునిక, సౌకర్యవంతమైన, పర్యావరణహిత పని ప్రదేశాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ సందర్భంగా పార్కులో కల్పించనున్న మౌలిక సదుపాయాలు, కొనసాగుతున్న పనుల పురోగతిని జోనల్ కమిషనర్ సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, వినియోగదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసి, ప్రతిపాదిత కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పార్కులను కేవలం వినోద, విశ్రాంతి ప్రదేశాలుగానే కాకుండా ఆధునిక అవసరాలకు అనుగుణంగా పని ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమం నగరవాసులకు కొత్త అనుభూతిని అందించనుంది.





