శేరిలింగంపల్లి-2 జోన్‌లో 957 మందికి చేయూత పింఛన్లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి-2 జోన్‌లో అర్హులైన 957 మందికి కొత్తగా చేయూత సామాజిక భద్రతా పింఛన్లు మంజూరయ్యాయి. మియాపూర్ సర్కిల్-48, మాదాపూర్ సర్కిల్-50 పరిధిలో వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు ఈ పింఛన్లు మంజూరు చేస్తూ ఈ నెల 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కొత్తగా మంజూరైన పింఛన్లలో వితంతు పింఛన్లు 656, దివ్యాంగుల పింఛన్లు 159, ఒంటరి మహిళల పింఛన్లు 120, అవివాహిత ఒంటరి మహిళల పింఛన్లు 22 ఉన్నాయి. సర్కిళ్ల వారీగా చూస్తే మియాపూర్ సర్కిల్-48 పరిధిలో అత్యధికంగా 852 మందికి, మాదాపూర్ సర్కిల్-50 పరిధిలో 105 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. మొత్తంగా 957 మంది లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా ఆర్థిక చేయూత లభించనుంది.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ మాలెంపాటి, మియాపూర్ డిప్యూటీ కమిషనర్ జి. శ్రీనివాస్, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు హఫీజ్‌పేట్, చందానగర్ మాజీ కార్పొరేటర్లు, మియాపూర్ సర్కిల్‌కు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు, పింఛన్ లబ్ధిదారులు హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పింఛన్లు, సామాజిక భద్రతా ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా, సకాలంలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here