- ఆదర్శ వివాహం చేసుకున్న ఆంధ్ర అబ్బాయి
- హిందు సాంప్రదాయంలో వైభవంగా పెళ్లి
- కన్యాదానం చేసిన వరుడి మేనమామ దంపతులు
నా అన్న వాళ్ళను కోల్పోయిన మౌనిక ఎందరో అనాథ చిన్నారుల మాదిరిగానే అభాగ్యురాలిగా మిగిలిపోయేది ఒకవేళ “సంకల్ప్ ఫౌండేషన్” చేరదీసి ఉండకపోతే. దశాబ్దం క్రితం అమ్మనాన్నను కోల్పోయి అభాగ్యురాలిగా మారిన ఆమెకు సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గుండ్ర రోజీ ఆదరించి అందమైన జీవితాన్ని అందించింది. తల్లి మరణించిన అనంతరం మౌనికను చేరదీసిన రోజీ విద్య బుద్దులు నేర్పింది. ఆ తర్వాత మౌనిక తండ్రి కూడా మరణించడంతో అన్నీ తానై చూసుకుని మౌనికకు పెళ్లీడు రావడంతో దగ్గరుండి పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన దొడ్ల ఆంజనేయులు, ప్రమీల దంపతుల కుమార్తె మౌనిక. మౌనిక చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో కూలి పని చేసుకునే తండ్రి వెంట రోజూ వెళ్ళేది. 2009 సంవత్సరంలో ఒకరోజు సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీ మౌనికను గమనించి తండ్రి అంగీకారంతో ఫౌండేషన్ లో ఆశ్రయం కల్పించి విద్య బుద్దులు నేర్పింది. ప్రస్తుతం మౌనిక ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజీ సంకల్పమో, మౌనిక అదృష్టమో గానీ తన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నా కూడా ఇంత చక్కని సంబంధం చూసి పెళ్లి చేసేవారు కాదేమో అన్నట్లుగా వివాహ వేడుక జరిగింది. ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తో పటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులూ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వరుడి మేనమామ ప్రోత్సాహంతోనే…
ఇటీవల సంకల్ప్ ఫౌండేషన్ లో ఆశ్రయం పొందిన మరో యువతి గీత వివాహం సైతం జరగడంతో పలు పత్రికలూ, న్యూస్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలలో వివాహానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన భవనారి బ్రహ్మం స్థానికంగా ఎంవి ఫౌండేషన్ లో సామజిక సేవ కార్యక్రమాలలో నిర్వహిస్తూ ఉంటాడు. సంకల్ప్ ఫౌండేషన్ సేవల గురించి తెలుసుకున్న బ్రహ్మం రోజీని సంప్రదించి మౌనిక గురించి తెలుసుకున్నాడు. మాచర్లలో కిరాణం హోల్ సేల్ వ్యాపారం నిర్వహించే తన మేనల్లుడు నరేంద్రకుమార్ తో వివాహం జరిపించాలని భావించాడు. నరేంద్ర కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం వివాహానికి అంగీకరించడంతో పెద్దల సమక్షంలో చందానగర్ లోని సంకల్ప్ ఫౌండేషన్ లో బుధవారం అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం జరిగింది. వరుడి మేనమామ భవనారి బ్రహ్మం పవిత్ర దంపతులు పెళ్లి పెద్దలుగా మరి కన్యాదానం చేయడం విశేషం.
అమ్మానాన్నలు లేని లోటుని రోజీ అక్క తీర్చింది: మౌనిక
నా చిన్నతనం నుండి రోజీ అక్క అమ్మా నాన్నలు లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసింది. నేను అనాథను అనే బాధ జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. నా అవసరాలు అన్నీ తీర్చి చదువు చెప్పించి ప్రయోజకురాలిగా మార్చింది. మంచి పెళ్లి సంబంధాన్ని చూసి పెళ్లి వేడుకను గొప్పగా జరిపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంత చక్కటి జీవింతాన్ని అందించిన రోజీ అక్కకు జీవితాంతం రుణపడి ఉంటాను.