శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హైడర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువుకు మహర్దశ తీసుకురానున్నట్లు PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలపై హైడ్రా అధికారులతో కలిసి బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అంబిర్ చెరువును త్వరలోనే సుందర శోభిత వనంగా తీర్చిదిద్ది, దాని రూపురేఖలను పూర్తిగా మారుస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలనీవాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

చెరువు ఆక్రమణలను తొలగించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని, చెరువు పరిధిలో జరిగిన కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుచించుకుపోయిన చెరువు విస్తీర్ణాన్ని కాపాడటంతో పాటు నాలాల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఆరోగ్యకరమైన శేరిలింగంపల్లి నిర్మాణమే తమ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నామని గాంధీ పేర్కొన్నారు. చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వాటి పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన సొంత నిధులతో పలు చెరువుల సుందరీకరణ పనులు చేపట్టినట్లు గాంధీ తెలిపారు. గంగారం, పటేల్ చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. గంగారం, పటేల్ చెరువులతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.
అంబిర్ చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, పచ్చదనంతో సరికొత్త రూపాన్ని తీసుకువస్తామని చెప్పారు. సుందరీకరణ పూర్తయిన అనంతరం రాత్రివేళ విద్యుత్ కాంతులు, పచ్చని ఉద్యానవనాలు, వాకింగ్ ట్రాక్లతో ఈ ప్రాంతం ప్రజలను ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు యూనస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





