- ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు
- రోజూ ప్రత్యేక అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
- నిత్యం పూజలు జరుగుతాయన్న ఆలయ కమిటీ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్ప ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్, ఫౌండర్ యూవీ రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిత్యం అమ్మవారిని ప్రత్యేక అవతారంలో అలంకరించడం జరుగుతుందని తెలిపారు. నిత్యం దేవికి ధూప దీప నైవేద్యాలతో పూజలు, అభిషేకాలు, హోమాలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ నెల 17వ తేదీ శనివారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తారని, అలాగే 18వ తేదీ ఆదివారం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో, 19వ తేదీ సోమవారం శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో, 20వ తేదీ మంగళవారం శ్రీ లలితా దేవి అవతారంలో, 21వ తేదీన బుధవారం శ్రీ సరస్వతీ దేవి అవతారంలో, 22న గురువారం శ్రీలక్ష్మీ దేవి అవతారంలో, 23న శుక్రవారం శ్రీ దుర్గా దేవి అవతారంలో, 24న శనివారం శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అవతారంలో, 25న ఆదివారం శ్రీ రాజ రాజేశ్వరిదేవి అవతారంలో దర్శనమిస్తుందని తెలిపారు.
ఇక 9 రోజుల పాటు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. 21వ తేదీన ఉదయం 10 గంటలకు సామూహికంగా విద్యార్థులచే సరస్వతీ పూజ జరుగుతుందని, 24న శనివారం ఉదయం 9 నుంచి చండీ హోం నిర్వహిస్తామని, అమ్మవారికి నవరాత్రుల్లో ధరింపజేసిన చీరలకు వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు.
25న ఆదివారం దసరా సందర్బంగా సాయంత్రం 6 గంటలకు శమీ పూజ నిర్వహిస్తామని, పూజల్లో పాల్గొనదలచిన భక్తులు తమ గోత్ర నామాలతో నమోదు చేయించుకోవాలని సూచించారు. 9 రోజులలో అమ్మవారి అలంకరణకు చీరలు వాడుతామని, పుష్పాలంకారసేవ ఉంటుందని, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రత్యేక శ్రీ చక్రార్చన సేవలో పాల్గొనే భక్తులు అర్చకులు లేదా ప్రధాన అర్చకుడు వేదుల పవన్ కుమార్ శర్మను 9849185220 ఫోన్ నంబర్‌లో సంప్రదించ వచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు ఆలయ ఇన్‌చార్జి ఉమా మహేశ్వరరావుని సంప్రదించవచ్చని, 9492126990 అనే నంబర్‌కు జీపే లేదా ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించి పూజలు, హోమాలు జరిపించుకోవచ్చని అన్నారు.